నల్లబెల్లి, మార్చి 30 : రామప్ప-రంగాయ చెరువు-పాకాల ప్రాజెక్టులో భాగమైన కాల్వలను సకాలంలో పూర్తి చేయకుండా కాంగ్రెస్ రైతులను ఇబ్బందులు పెడుతున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం వద్ద నర్సంపేట-మల్లంపల్లి ఎన్‌హెచ్ 365పై రంగాయ చెరువు కాల్వకు సంబంధించిన కల్వర్టు నిర్మించి పంటలకు నీరందించాలని పలు మండలాల రైతులు సో మవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ నిరసనకు సంఘీభావం తెలిపిన పెద్ది మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి తరలించే క్రమంలో 3.5 టీఎంసీల జలాలు రంగాయ చెరువులో నిల్వ చేసే పనులు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లయినా కాల్వల నిర్మాణం పూర్తి చేయలేదన్నారు. దీంతో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. సుమారు 85 శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన వాటిని పూర్తి చేయకుండా పంటలను ఎండబెడుతున్నారన్నారు.
నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లోని 68 గ్రామాల పరిధిలోని 32,500 ఎకరాలకు సాగు నీరందించే రంగాయ చెరువు ప్రాజెక్టును కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. జిల్లాకు అనేకసార్లు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్షించలేదన్నారు. ఇప్పటికైనా మిగిలిన పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరందించాలని, లేదం టే రైతుల తరపున ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని పెద్ది హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ న ర్సంపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ తక్కళ్లపల్లి రవీందర్రావు, మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, నాయకులు ఊడ్గుల ప్రవీణ్‌గౌడ్, గందె శ్రీనివాస్‌గుప్తా, తాడబోయిన విజయ్, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.