వరంగల్, అక్టోబర్ 18(నమస్తేతెలంగాణ): అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సహకార, మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం జరిగింది. చైర్మన్, మహ బూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీవాకడే పాల్గొన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలతోపా టు రాష్ట్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై చర్చ జరిగింది. ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ సరిగా లేదన్నారు. బాలికలు ఎక్కువ మంది ఉన్న స్కూళ్లలో సీసీ కెమెరాలను అమర్చి వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అనుసంధారించాలని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల వారీగా వివరాలను తనకు అంద జేయకపోవడంపై ఎంపీ బలరాంనాయక్ డీఈవో జ్ఞానేశ్వర్‌పై దిశ చైర్మన్ ఆగ్రహం వెలిబుచ్చారు.
పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ జరుగుతుందని, ఏం చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మాధవరెడ్డి అధికారులను ప్రశ్నించారు. పీడీఎస్ రైస్‌ను పక్కదారి పట్టించిన రేషన్ డీలర్లలో ఎందరిపై చర్య తీసుకున్నారని, ఎందరి డీలర్‌షిప్‌లను రద్దు చేశారని, ఎంతమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారని ఎమ్మెల్సీ సారయ్య అన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కొన్ని రైస్‌మిల్లుల నిర్వాహకులు రెగ్యులర్‌గా పీడీఎస్ రైస్‌ను కొంటున్నారన్నారు. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు కేంద్రం నుంచి గత ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షలు వస్తే వాటిలో రూ.20 లక్షలు ఖర్చు చేయకపోవడంపై ఎంపీ ఆగ్రహం వెలిబుచ్చారు.
నర్సంపేటలో నాలుగు రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. పైపులైన్లు, వాటర్‌ట్యాంకుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర మేయర్ సుధారాణి మాట్లాడుతూ ప్రజారోగ్యశాఖ, జీడబ్ల్యూ ఎంసీ ఇంజినీర్లు సమన్వయంతో పనిచేసి నీటి సరఫరాలో సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రజారోగ్యశాఖ ఎస్ఈ సమావేశానికి రాకపోవడంపై ప్రజాప్రతినిధులు నిరసన వెలిబుచ్చారు. సమావేశంలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్లు గుంటి రజిని, అంగోతు అరుణ, డీఆర్డీవో కౌసల్యాదేవి, డీఏవో అనురాధ, సీఈవో రాం రెడ్డి, కుడా పీవో అజిత్రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.