వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు కష్టాలు తప్పడం లేదు. పలు విభాగాల్లో నెలకొన్న సమస్యలు వీడడం లేదు. అధికారులు పర్యవేక్షించక.. ప్రజాప్రతినిధులు పట్టించుకోక పేదలకు వైద్య సేవలు అందడం లేదు. విద్యుత్ సరఫరా నుంచి అత్యవసర మందుల వరకు అంతా కొరతనే.. యంత్ర పరికరాలు, అంబులెన్స్‌లు, ఏసీలు, ఫ్యాన్లు.. ఇలా ఆస్పత్రిలోనే అనేకం పని చేయడం లేదు. ఇక మార్చురీలోని సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అయితే అన్నీ సమకూర్చాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండగా.. వైద్యం కోసం వచ్చే పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
– వరంగల్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం పని చేస్తే.. కాంగ్రెస్ సర్కారు హయాంలో దీనికి విరుద్ధంగా జరుగుతున్నది. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) హాస్పిటల్లో వైద్యం అందడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. వైద్య సేవలకు ఎప్పటికప్పుడు అవసరమయ్యే వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంలేదు. ఎంజీఎంలో కరెంటు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. దీంతో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలను వినియోగించే పరిస్థితి ఉండడం లేదు.
జనరేటర్ల వ్యవస్థ సైతం అంతంత మాత్రంగానే ఉన్నది. ఐసీయూ, ఆర్ఐసీయూ, గుండె జబ్బులు, ఆపరేషన్ థియేటర్, పిల్లల వార్డుల్లో వెంటిలేటర్లపై ఉండే రోగుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్నది. పైగా యంత్రాలు, పరికరాలు కూడా అందుబాటులో ఉండడం లేదు. రేడియాలజీ విభాగంలో డిజిటల్ ఎక్స్‌రే యంత్రం సరిగా పని చేయడంలేదు. అత్యవసర విభాగంలో వినియోగించే మిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. గుండె స్థితిని అంచనా వేసే ఈసీజీ యంత్రాలు అందుబాటులో లేవు. రోగ నిర్ధారణ కోసం వినియోగించే కెమికల్స్‌కు కూడా కొరత ఉన్నది.
వైద్య సేవల్లో కీలకమైన మందులు కూడా ఎంజీఎంకు సక్రమంగా సరఫరా కావడం లేదు. రోగులకు అవసరమైన మందులకు ఎప్పుడూ కొరత ఉంటుండగా, అనవసరమైనవి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సెంట్రల్ డ్రగ్ సెంటర్ నుంచి ఎంజీఎంకు మందులు రవాణా చేసే వాహనాలు కూడా తరచూ మరమ్మతుకు గురవుతున్నాయి. మందులను రోజూ కాకుండా వాహనాలు సరిగా ఉన్నప్పుడే తీసుకొస్తున్నారు.
అత్యవసరంలో వినియోగించే నాలుగు అంబులెన్స్‌ల్లో ఒకటి మాత్రమే అంతంత మాత్రంగా పని చేస్తున్నది. పేద రోగులు ఎంజీఎంకు వచ్చేందుకు ప్రైవేట్ అంబులెన్స్‌లపై ఆధారపడాల్సి వస్తున్నది. అత్యవసర పరిస్థితి, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి ఐసీయూ, ఇతర ప్రత్యేక వ్యవస్థలున్న ప్రాంతంలోనే చికిత్స అందిస్తారు. ఎంజీఎంలో ఇలాంటి ప్రత్యేక వ్యవస్థలు సరిగా లేవు. ఏసీలతో పాటు ఫ్యాన్లు సైతం పని చేయడంలేదు. రోగులు ఇంటి నుంచి ఫ్యాన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
ఎంజీఎం మార్చురీ విభాగంలో ఫ్రీజర్లు పని చేయక మృతదేహాలు ఒక్క రోజులోనే చెడిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృతదేహాలను వారాల తరబడి మార్చురీలోనే ఉంచాల్సి ఉంటుంది. పోలీసు విచారణ, ఇతర అధికార ప్రక్రియ పూర్తయిన తర్వాతే బంధువులకు అప్పగించాలి. గుర్తు తెలియని మృతదేహాలను మూడు రోజుల పాటు భద్రపరుస్తారు.
ఫ్రీజర్లు, ఏసీలు పనిచేయకపోవడంతో అంతిమ సంస్కారాలకు ముందే మృతదేహాలు పాడైపోతున్నాయి. ఇలాంటి స్థితిలో మృతదేహాలను గుర్తించేందుకు బంధువులు ఇబ్బంది పడుతున్నారు. మార్చురీలోని ఫ్రీజర్లు, ఏసీలు కొత్తవి పెట్టాలని ఈ విభాగంలోని డాక్టర్లు, సిబ్బంది ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నది.