ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన పెద్దాసుపత్రి అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఎంజీఎం దవాఖానకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారి పేషెంట్లకు నరకం చూపిస్తున్నవి. తరచూ యంత్రాలు, పరికరాలు మరమ్మతులకు గురవుతున్నా వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయక పోవడం తో అవి రోగుల పాలిట శాపంగా మారాయి. అం బులెన్స్లకు రిపేర్ చేయించక మూలన పడుతున్నాయి. రసాయనాల కొరతతో పరీక్షలు నిలిచిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఉద్యోగులు ప్రైవేట్ ల్యాబ్‌లతో కలిసి దందాలు చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ఒక్కో పనికి ఒక్కో రేటు ఏర్పాటు చేసుకొని వసూళ్లకు తెగబడుతున్నారు. దీంతో అసౌకర్యాల నడుమ మెరుగైన సేవలందక పేషెంట్లు, అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
– వరంగల్ చౌరస్తా, మే 4
ఎంజీఎం హాస్పిటల్లో సమస్యలు తిష్ట వేశాయి. దవాఖానలో అంతర్గత రోడ్లు రాళ్లు తేలి 108 వాహనాలు, అంబులెన్స్‌ల్లో ప్రయాణించే రోగులకు నరకం కనిపిస్తున్నది. ఈ రహదారుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని హాస్పిటల్ సమీక్షలో మంత్రి అధికారులను ఆదేశించిన ప్పటికీ మంత్రి ఆదేశించినప్పటికీ అవి బుట్టదాఖలయ్యాయి. తరచూ మిషన్లు, పరికరాలు పాడై పేషెంట్లకు సరైన వైద్యసేవలు అందడం లేదు. కొందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రైవేట్ ల్యాబో రేటరీ నిర్వాహకులతో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకొని నమూనాలు సేకరించడానికి వార్డుల్లోకి అనుమతిస్తున్నారు.
ఫార్మసీ స్టోర్స్‌కు మందులు తీసుకొచ్చే డీసీఎంకు తప్పనిసరి పరి స్థితిలో మరమ్మతులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. మూడు అంబులెన్స్‌లు మూలనపడ్డాయి. ఇంకో దాన్ని కష్టంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు రోగులను తరలిస్తున్నారు. ఎంజీఎం ఆవరణలో సుమారు 50కిపైగా అద్దె చెల్లింపు విధానంలో షాపులు ఏర్పాటు చేయగా, దీనిని ఆనుకొనే ఆక్సిజన్ పైప్‌లైన్ ఉండడంతో ఏ ప్రమాదం జరుగుతుందోనని రోగులు భయపడుతున్నారు. 2024 సెప్టెంబర్ 19వ తేదీన ప్రత్యేక కమిటీ షాపులపై విచారణ జరిపి నిబంధనలు విస్మరించి షాపులు నిర్వహిస్తున్నట్లు నివేదిక సమర్పించినప్పటికీ చర్యలు మాత్రం కనిపించడం లేదు.
హాస్పిటల్ అవసరానికి తగినన్ని ఈసీజీ యంత్రాలు లేవు. రసాయనాలు లేక చాలా వరకు పారా మెడికల్ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. దీనికి తోడు వైద్యులు వినియోగించే చేతి గ్లౌస్లు, శానిటేషన్ సిబ్బందికి అందించే కనీస వసతుల నిల్వలు సైతం అందుబాటులో లేకపో వడంతో పారిశుద్య కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రోహిణి హాస్పిటల్ అగ్ని ప్రమాదం ఘటన అనంతరం ఎంజీఎం హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీకి చర్యలు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారు. దీంతో ప్రధాన వార్డులో ఏర్పాటు చేసిన పైప్ లైన్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి.