పేదల పెద్దాసుపత్రి ఎంజీఎం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకులు, పాలనాధికారులు పట్టింపులేక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మొన్నటి పసికందు ఘటన తర్వాతే తీరు మారకపోగా నిండా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. మళ్లీ ఎప్పటిలాగే దవాఖాన ఆవరణలో వీధి కుక్కల స్వైరవిహారం, మందుబాబులు తాపీగా చిల్కొట్టి వదిలి వెళ్లిన బీరు సీసాలు భద్రతా వైఫల్యానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంతేగాక పలు విభాగాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని తొలగించకుండా చోద్యం చేస్తున్నారు.
అలాగే దవాఖానకు వచ్చే ప్రధాన దారులు సైతం గుంతలమయం కాగా, క్యాజువాలిటీ వద్ద ఎండిపోయిన ఓ భారీ చెట్టు ప్రమాదకరంగా మారి ఎప్పుడు కూలుతుందోనని రోగులు, అటెండెంట్లు భయాందోళన చెందుతున్నారు. ఇటు వర్షాలు, విషజ్వరాల సీజన్లో అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలందించడంతో పాటు దవాఖానను పరిశుభ్రంగా ఉంచాల్సింది పోయి ఇలా గాలికొదిలేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
– వరంగల్ చౌరస్తా, ఆగస్టు 12
ఎంజీఎం హాస్పిటల్‌కు మూడు మెయిన్ గేట్లు ఉన్నాయి. అత్యవసర విభాగానికి చేరుకునే అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు మొదటి గేటు గుండా, ఓపీ సేవలు వినియోగించుకునే వారు రెండో గేటు ద్వారా వస్తుంటారు. ఈ రెండు గేట్ల ద్వారా నిత్యం ఎంతోమంది రోగులు, అటెండెంట్లు నడుచుకుంటూ వస్తారు. కానీ ఈ రోడ్డుపై గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలినా మరమ్మతులు చేయకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు.
ఎంజీఎం ఆవరణలో ఎక్కడ చూసిన కుక్కలే కనిపిస్తున్నాయి. ఇటీవల మృతశిశువు ఘటన తర్వాత మంత్రి ఆదేశాలతో మున్సిపాలిటీ వారు 12 కుక్కలను పట్టుకున్నా ఎంజీఎంలో కుక్కల సంచారం ఆగలేదు. ముఖ్యంగా జన సంచారం తక్కువగా ఉండే పీడియాట్రిక్, మానసిక వైద్యవిభాగం ప్రాంతాల్లో కుక్కల స్వైరవిహారం ఎక్కువ ఉంటున్నదని, రాత్రి వేళ అటువైపు వెళ్లేందుకు అటెండెంట్లు, సిబ్బంది సైతం జంకుతున్నారు.
కొవిడ్ సమయంలో ఎన్నో వేల ప్రాణాలు నిలబెట్టిన ఎంజీఎం దవాఖాన ప్రతిష్ట ఇప్పుడు రోజురోజుకూ మసకబారుతోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారుల చిన్నచూపు వల్ల వైద్య సేవలు, మౌలిక వసతులు కరువయ్యాయి. అంతర్గత రోడ్లు, పరిశుభ్రత, భద్రత అంశాలపై దృష్టి పెట్టకపోవడంతో దవాఖాన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల శిశువు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతున్న ఘటన జరిగిన తర్వాత కూడా నిఘా పెట్టకపోవడమే గాక కొత్త సీసీ కెమెరాలు అమర్చకుండా కాలయాపన చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎంజీఎంకు వచ్చే రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వారి ప్రాణాలకు, భద్రతకు భరోసా కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వైద్యం కోసం వచ్చే రోగుల అటెండెంట్లు రాత్రయ్యిందటే చాలు ఎంజీఎం ఆవరణలోనే మందు విందులు చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం, అధికారులు మచ్చుకైనా కనిపించకపోవడం, కరోనా, పీడియాట్రిక్, ఆంకాలజీ విభాగాల ప్రాంతంలో జనసంచారం లేకపోవడం వల్ల అర్ధరాత్రి వేళ అక్కడే మందు కొడుతున్నారు. కొన్ని విభాగాల్లో సిబ్బంది ఏమరపాటుగా ఉన్న సమయాల్లో రోగులు సైతం విభాగాలు దాటి వచ్చి ధూమపానం చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీనికి తోడు ఎంజీఎం ఆవరణలో కొందరు చిరువ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి సిగరెట్లు, గుట్కాల విక్రయిస్తుండడంతో ఇతర ప్రాంతాల నుంచి యువత ఎక్కువ సంఖ్యలో ఎంజీఎంకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.
అత్యవసర విభాగం అనుక్షణం రోగులు, క్షతగాత్రుల రాకపోకలతో నిత్యం బిజీగా ఉంటుంది. 108 అంబులెన్సులు, ప్రైవేట్ అంబులెన్స్‌లు సైతం అత్యవసర వైద్యసేవల కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. ఇక్కడే ఉన్న రెండు భారీ చెట్లు ఎండిపోయి గాలివానకు ఎప్పుడు విరిగిపడుతాయోనని భయంభయంగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎవరికీ ప్రమాదం జరుగకముందే తొలగించాలని కోరుతున్నారు. ఇటీవల తిరుపతిలో ఓ భక్తురాలిపై ఎండిన చెట్టు కొమ్మ విరిగిపడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు.