భీమదేవరపల్లి, జూన్ 05: ఆర్టీసీ బస్సులో గ్యాస్ లీక్ అవడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపెల్లి క్రాసింగ్ వద్ద హుస్నాబాద్ నుంచి ఆలేరు, జనగాం వెలుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. బస్సులోని ప్రయాణికులు అరుపులు, కేకలు వేస్తూ పరుగులు తీశారు బస్సులో ఎవరో గ్యాస్ సిలిండర్ తీసుకు వస్తున్నారని, అది లీక్ అయి ముక్కులు పగిలేలా వాసన వస్తుందని, ఏ క్షణమైనా పేలుతుందంటూ అరవసాగారు. బస్సులో చిన్న పిల్లలు, వృద్దులు ఉన్నారని చూడకుండా ప్రయాణికులు అరుస్తూ బస్సు దిగి పరుగులు పెట్టారు.
ఒక యువకుడు చేయి సంచితో మెల్లగా బస్సు దిగుతుండగా డ్రైవర్, కండక్టర్ గుర్తించారు. అతని సంచిలో అతి భయంకరమైన యాసిడ్ క్యాన్ ఉంది. అది లీక్ కావడంతో గ్యాస్ లీక్ అని ప్రయాణికులు పరుగులు తీశారు. అతిగా మద్యం సేవించి ఉన్న ఆ యువకుడు సంచి చేత పట్టుకుని పక్క నుంచి వెళ్తున్న ఆటో ఆపి అందులో వెళ్లాడు. అతను వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులోకి ప్రయాణీకులు ఎక్కి అక్కడినుండి తాపీగా నిష్క్రమించారు.