ములుగు, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాకేంద్రం సహా ఏటూరునాగారం, మంగపేట ప్రాంతాల నుంచి పనులు, విధుల కోసం హనుమకొండకు వెళ్లడం సరే గానీ తిరిగి ఇంటికి చేరడం సగటు ప్రయాణికుడికి గగనమవుతోంది. సరిపడా బస్సుల్లేక హనుమకొండ బస్‌స్టేషన్‌లో గంటల తరబడి పడిగాపులు కాస్తూ తిరుగు ప్రయాణం కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం సుమారు 400మంది ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్లో తమ ఆవేదనను పంచుకోవడంతో పాటు తిరుగు ప్రయాణం కోసం వారు తిప్పలు ఫొటోలను పంపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రాంతాలకు ఐదు నిమిషాలకు ఒక బస్సు వెళ్తుందని, ములుగు ప్రాంతానికి మాత్రం సాయంత్రం అయిందంటే ప్రతీ రోజు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఒక బస్సు వస్తే సీటు కోసం తొక్కిసలాటలు జరిగే దుస్థితి నెలకొందని ఆరోపించారు.
అంతేగాక ములుగు ప్రయాణికులను చిన్నచూపు చూసేలా బస్టాండ్ చివరికి రేకుల షెడ్ వేశారని చిన్నబుచ్చుకున్నారు. అంతేగాక ఆ ప్రాంతంలో అందరూ మూత్రవిసర్జన చేయడం వల్ల దుర్వాసనతో కనీసం నిల్చొలేకపోతున్నామని ఆవేదనతో చెప్పారు. అటు బస్సులు రాక.. ఆర్టీసీ అధికారులు పట్టించుకోక నరకం అనుభవిస్తున్నామని వాపోయారు. ఇప్పటికైనా సాయంత్రం వేళ హనుమకొండ నుంచి ములుగు ప్రాంతానికి సరిపడా బస్సులు ఏర్పాటుచేయడంతో పాటు ములుగ పాయింట్‌ను సుందరీకరించాలని డిమాండ్ చేశారు.