రాయపర్తి : క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని మైలారంకు చెందిన గాడిపల్లి ప్రశాంత్ కుమార్ ఇటీవల కాంబోడియా దేశంలో జరిగిన మొదటి ఆసియా పారా త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని కాంస్య పతక విజేతగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మండల బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గాడిపల్లి ప్రశాంత్ ను సోమవారం ఘనంగా సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని 80 దేశాల క్రీడాకారులు పాల్గొన్న మొదటి ఆసియా పారా త్రో బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశంతో పాటు జన్మ స్థలానికి కీర్తి ప్రతిష్టలు తీసుకు వచ్చిన ప్రశాంత్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రశాంత్ కు మండల భారత రాష్ట్ర సమితి శ్రేణులు అండగా ఉంటారని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు లేతాకుల రంగారెడ్డి, పూస మధు, భూక్య సురేందర్ రాథోడ్ నాయక్, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, మహమ్మద్ యూసఫ్, కోల సంపత్, సంకినేని ఎల్లస్వామి, గాడిపల్లి రాములు చిర్ర దర్గయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.