శాయంపేట, డిసెంబర్ 1 : ‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ గ్రామానికి మూడో విడతలో ఈనెల 17న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగనున్నా యి. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌గా రిజర్వేషన్ ఖరారైంది. గ్రామంలో పది వార్డు స్థానా లున్నాయి.
మొత్తం1545 ఓట్లుండగా, ఇందులో పురుషులు 757, మహిళలు 788 మంది ఉన్నారు. ఎస్సీలు 286, ఎస్టీలు 51, బీసీలు 845, ఇతర ఓటర్లు 363 మంది ఉన్నారు. రొటేష న్ పద్ధతిలో ఈసారి ఎస్సీలకు సర్పంచ్ పదవి దక్కడంతో పోటీలో ఉండే అభ్యర్థులు సోమవారం సమావేశమై కుల పెద్ద మనుషుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ప్రకటించారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలని, ఏ పార్టీ మద్దతు తీసుకోవద్దని తీర్మానం చేశారు. పోటీలో ఉండి ఖర్చులతో ఇబ్బంది కావొద్దని, అభ్యర్థి కుటుంబం రోడ్డున పడొద్దన్న ఉద్దేశంతోనే తీర్మానం చేసినట్లు తెలిపారు. దీన్ని పాటించకపోతే కుల బహిష్కరణ చేస్తామని పేర్కొన్నారు.