పరకాల, జూలై 17 : సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఉచిత కరంట్ వద్దన్న కాంగ్రెస్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ర్టాన్ని పాలిస్తున్న సీఎం కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల కళ్లలో సంతోషం చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా గడపగడపకూ అందుతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే మార్గదర్శకంగా ఉందన్నారు. కానీ, ఈ అభివృద్ధిని జీర్ణించుకోలేని విపక్ష పార్టీలు తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్నల వెన్నుముక విరువాలని చూస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీలను రాష్ట్రం నుంచి తరిమివేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు అవుతుందని, రాష్ట్రంలో చీకట్లు అలుముకుంటాయన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో రైతులను మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఆయా పార్టీల నాయకులను గ్రామాల్లోకి రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి పది రోజుల నియోజకవర్గం వ్యాప్తంగా క్లస్టర్ల వారీగా నిరసన తెలుపనున్నట్లు చెప్పారు. ఇందులో రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలు మండలాల ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి
సంగెం : రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో కృషి చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మండలంలోని రేషన్ డీలర్లు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. దీంతో రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లింపు, డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు విషయాలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.