జనగామ, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ‘వరంగల్లోఈ నెల 27న అంబరాన్నంటేలా నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు రావాలని గడపగడపను తట్టి ప్రజలను ఆహ్వానించాలి.. ఊరూవాడా జాతరలా తరలివచ్చేలా జన సమీకరణ చేయాలి.. వాహన సౌకర్యం కల్పిస్తున్నందున ప్రతి నాయకుడు, కార్యకర్త సహా ప్రజలు భారీగా హాజరయ్యేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలి’ అని బీఆర్ఎస్ శ్రేణులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు.
సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో జనగామ మున్సిపాలి టీ, రూరల్ మండల ముఖ్య నాయకులతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ సభను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని, గతంలో ఇక్కడ నిర్వహించిన సభ దేశంలోనే అత్యంత పెద్దదిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఇది ప్రజా జాగరణ బహిరంగ సభగా చరిత్ర సృష్టించబోతున్నదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో భారీ ఎత్తున ప్రజలు వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి కార్యకర్త కథానాయకుడిగా మారి రాష్ట్రంలో సాధించిన ప్రగతి, చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం చేయడంతో పాటు మహాసభ విజయవంతానికి కృషి చేయాలన్నారు.
‘ధాన్యం క్వింటాకు రూ. 2,750 ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రూ.1,650-1,750 ఇచ్చేందుకు రాజకీయ నేతలు, అధికారులు కుమ్మకయ్యారు. బోనస్ పేరు చెప్పి మోసగించారు.. ఇది రైతులకు చేసిన ద్రోహం’ అని పల్లా మండిపడ్డారు. ధర్మసాగర్ పంపుల వద్ద సిబ్బంది 34 రోజులు సమ్మె చేయడంతో జనగామ, పెద్దరాంచర్ల, వడ్లకొండ తదితర ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయని, దీంతో రైతులకు రూ. 600 కోట్ల నష్టం మిగిలిందన్నారు.
16 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తాగు, సాగునీటి సమస్యలను పరిషరించలేకపోయిందని, రైతులు నీళ్ల కోసం పోరాడుతుంటే అధికారపార్టీ నాయకులు స్పందించక పోవడం దారుణమన్నారు. కేసీఆర్ నేతృత్వంలో 5.14 లక్షల ఎకరాలకు సాగునీళ్లందించే దిశగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, టన్నెల్లు, పంపుల పనులు పూర్తయినా ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రారంభించలేదన్నారు. అభివృద్ధి పనుల కోసం తాను పోరాడతానని, ధర్మసాగర్ నుంచి రిజర్వాయర్లకు అవసరమైన నీళ్లు చేరేలా కృషిచేస్తానని పల్లా హామీ ఇచ్చారు.
‘కడియం శ్రీహరి.. నీలాగా నేను గుంట నక్కను కాదు.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజల కోసం కాపలా కుక్కలా ఉంటా’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇటీవలె తనను బొచ్చు కుక అని విమర్శించిన కడియం శ్రీహరిపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘అవును నేను కుకనే.. నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారిని కాపాడేందుకు కాపలా కుకగా ఉంటా.. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు విశ్వాసం కలిగిన కుక్కలా పనిచేస్తా.. నీ నుంచి అటవీ భూములు కాపాడేందుకు రేసు కుక్కను అవుతా‘ అంటూ స్పష్టం చేశారు.
అధికారవాంఛ, ధనదాహం కోసం ఊసరవెల్లులే సిగ్గుపడేలా పార్టీలు మార్చే నువ్వా నన్ను విమర్శించేది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు విశ్వాసంగా ఉండే కుకనన్నారు. ఎవరేం చేస్తున్నారో ప్రజలకు తెలుసని, వారికి అండగా తానుంటానని, నిన్ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం నాకుంది అంటూ కడియంకు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనే ఘన్‌పూర్‌కు మంజూరైన మున్సిపాలిటీ, డిగ్రీ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, 100 పడకల ఆస్పత్రి, నవాబ్‌పేట లైనింగ్ పనులను పార్టీలో ఉంటూనే అడ్డుకున్న చరిత్ర కడియం శ్రీహరిదని, అభివృద్ధి చేసే ఘనత బీఆర్ఎస్ది అని ఎమ్మెల్యే పల్లా అన్నారు.
– కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే పల్లా ఫైర్