జనగామ, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఎన్యుమరేషన్ పత్రాలను సక్రమంగా నింపడంలో సహకరించాలని సూచించారు. సోమవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఎన్యుమరేషన్ ఫామ్‌లు నింపే విధానంపై కీలక సూచనలు చేశారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటికి రెండు ప్రీ-ప్రింటెడ్ ఎన్యుమరేషన్ పత్రాలు అందజేస్తారని, వాటిలో ఒకదానిని పూర్తి చేసి బీఎల్వోకు ఇవ్వాలని, మరో కాపీని రసీదుగా భద్రపరుచుకోవాలన్నారు. కుటుంబంలోని ఓటర్ల వివరాలను ఒకే చోట నమోదు చేసే ఫ్యామిలీ మ్యాపింగ్ అత్యంత కీలకమని, 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా పరిగణిస్తారని వివరించారు. ఆధార్‌లో ఉన్న వివరాలకు అనుగుణంగానే ఫామ్‌ను నింపాలని, అవసరమైన డిక్లరేషన్‌పై సంతకం చేయాలన్నారు.
జూలై 24 వరకు ఇంటింటి వెరిఫికేషన్, ఫామ్‌ల సేకరణ జరుగుతుందన్నారు. జూలై 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తారని, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరించి అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారని వివరించారు. ఓటర్లు ఆఫ్‌లైన్‌తో పాటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చన్నారు. ఎకడైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని రాజేశ్వర్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు.