జనగామ, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : జనగామ ప్రజలకు గోదావరి, మిషన్ భగీరథ నీళ్లిచ్చి కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ గూండా రాజకీయం.. రౌడీయిజం చేసి ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తే విజ్ఞులైన ప్రజలు తిప్పికొట్టబోతున్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా జనగామ మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండే అని స్పష్టం చేశారు. పట్టణంలోని మెజార్టీ వార్డు స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని అన్నారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టితీయని.. మూరెడు రోడ్డు వేయని సంగతి అందరికీ తెలుసున్నారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ మొహం చూసి ఓటేసి రుణం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.