బచ్చన్నపేట, ఏప్రిల్ 13 : కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్నరామన్చర్ల, నక్కవానిగూడెం, కొడవటూరు, కొన్నె, రామచంద్రాపూర్, పడమటికేశ్వాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రా రంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం 17 ఉంటే ధాన్యాన్ని స్వీకరించాలన్నారు. ఒకసారి స్వీకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తర్వాత తిరస్కరించే పరిస్థితి రాకూడదన్నారు. నాణ్యతను పరిశీలించి తీసుకుంటే మిల్లుల వద్ద ఇబ్బందులు తలెత్తవన్నారు. కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పల్లా సూచించారు. ఆయన వెంట చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేతావెంకన్న, నాయకులు గంగం సతీశ్‌రెడ్డి, చల్లా శ్రీనివాస్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లున్నారు.