కొత్తగూడెం గణేష్టెంపుల్, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురసరించుకుని కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిషరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ ఒకప్పుడు కరెంటు లేక, సాగునీరు రాక అల్లాడిన తెలంగాణను కేసీఆర్ తన దార్శనికతతో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. 24గంటల నిరంతర నాణ్యమైన కరెంటు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయన్నారు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తుచేశారు.
కానీ నేడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం కొనసాగుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ విధ్వంసకర పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, నాయకులు దిండిగాల రాజేందర్, మానె రామకృష్ణ, బానోత్ హరిసింగ్, కామిరెడ్డి శ్రీలత, కిలారు నాగేశ్వరరావు, కాపు సీతాలక్ష్మి, వేల్పుల దామోదర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేటర్లు వీరమ్మ, సాగర్, స్వప్న, మధుచంద్, సింధుతపస్వీ, గుణచరిత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.