కొత్తగూడెం సింగరేణి, ఆగస్టు 15: సింగరేణి సంస్థకు రెండు కొత్త బ్లాకులు లభించడం సంతోషదాయకమని, రానున్న రోజుల్లో మరికొన్ని గనుల సాధనతో నూతన జవసత్వాలు సంతరించుకొని రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగినంత బొగ్గును అందిస్తూ దేశ సేవకు పునరంకితం అవుతుందని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి అన్నారు. శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో జాతీయజెండాను ఎగురవేసి ప్రసంగించారు.
సింగరేణి సంస్థ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తాడిచర్ల-2 బ్లాక్‌కు మైనింగ్ లీజు లభించిందని, ప్రభుత్వం ప్రత్యేక కృషితో దక్కిన ఈ బ్లాక్ వల్ల సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేరసే అవకాశం లభించిందని, తద్వారా 40 సంవత్సరాలపాటు ఇక్కడ మైనింగ్ చేయడానికి అవకాశం కలిగిందన్నారు. సంస్థ అభివృద్దికి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సంస్థ ఉత్పత్తికి, విస్తరణకు సహకరిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. గని ప్రమాదాల నివారణకు రక్షణ వారోత్సవాల పేరుతో కార్మికులు, అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తిరుమలరావు, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు, ఏఐటీయూసీ నుంచి ఎస్వీ రమణమూర్తి, ఐఎన్టీయూసీ నుంచి పీతాంబరరావు తదితరులు పాల్గొన్నారు.