వేలేరు, ఏప్రిల్ 16 : స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన అభివృద్ధి శూన్యమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌కు 2014లో రూ. 8 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేసింది మాజీ సీఎం కేసీఆరే అని పేర్కొన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడషపల్లిలోని ఆయన స్వగృహంలో స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన వేలేరు, చిల్పూరు, ధర్మసాగర్ మండలాల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పల్లా పాల్గొని మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు. 2004 నుంచి ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలవలేదని, అభివృద్ధి ఎలా చేశాడో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదుల ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి వదిలేస్తే డాక్టర్ టీ రాజయ్య దేవాదుల వద్ద పిండాలు పెట్టి నిరసన తెలిపిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. 2023లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే ఇన్చార్జిగా పల్లా రాజేశ్వర్రెడ్డే ఉండాలని కోరింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాల బీఆర్ఎస్ శ్రేణుల కృషితోనే నీకు మెజారిటీ దక్కిందని, వారిపైనే అక్రమ కేసులు పెట్టాడానికి మనసెలా వచ్చిందన్నారు. దేవునూర్ గుట్టల్లో నీకు సూమారు 21 ఎకరాల భూమి ఉందని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తావా? అని ప్రశ్నించారు. కడియంకు వయసు మీదపడడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నాడని పల్లా ఎద్దేవాచేశారు. నీతి, నిజాయితీ ఉంటే బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో పోటీ పడాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య సవాల్ విసిరారు. నిన్ను ఓడించాలని రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తున్నదని రాజయ్య అన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరిన 150 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే పల్లా, రాజయ్య గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో జనగామ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మండల ఇన్చార్జిలు ఇట్టబోయిన భూపతిరాజు, కర్ర సోమిరెడ్డి, మనోజ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నిమ్మ కవిత, మాజీ వైస్‌ఎంపీపీ సంపత్, మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వర్లు, గ్రామశాఖ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, మండల నాయకులు మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, మరిజె నర్సింహారావు, బొడ్డు ప్రభుదాస్, రమేశ్‌నాయక్, గోవింద సురేశ్, ఇట్టబొయిన సంపత్, కొయ్యడ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.