జిల్లాలో వరి కోతలు షురువయ్యాయి. మరో వారం రోజుల్లో జోరందుకోనున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కమలాపూర్ మండలంలో 19, ఎల్కతుర్తి మండలంలో నాలుగు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 59,539 వరి పంట సాగు కాగా, 3.18 లక్షల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా ఉంది. ఆహార అవసరాలకు పోను 2లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసేందుకు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పీఏసీఎస్, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. 16 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. మరో 10లక్షల సంచులను కొనుగోలు కేంద్రాలకు పంపనున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను తరలించే లారీ ట్రాన్స్‌ఫోర్టు టెండర్ పూర్తయ్యింది.
వరంగల్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్నదాతకు రాష్ట్ర సర్కారు అండదండలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను మద్దతు ధరకు కొంటున్నది. వరి కోతలు మొదలైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ముందుగా పంట కోతకు వచ్చినందున కొనుగోలు కేంద్రాలు మొదలయ్యాయి. కమలాపూర్ మండలంలో 19, ఎల్కతుర్తి మండలంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. నిర్దేశిత శాతం తేమ ఉన్న వడ్లను కాంటా పెడుతున్నారు. వడ్ల కొనుగోలులో రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. పంట కోసిన రైతులు వడ్లను ఆరబెట్టి, తేమ 17శాతం ఉండేలా చూసుకోవాలని, చెత్త, తాలు, మట్టిపెళ్లలు, రాళ్లు మొత్తం వడ్లలో ఒక శాతానికి మించకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలని, పాడైన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు ఆశించిన వడ్లు 5 శాతం దాటొద్దని, బెరుకులు శాతం మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మరో వారం రోజుల్లో..
జిల్లా వ్యాప్తంగా మరో వారం రోజుల్లో వరి కోతలు జోరందుకోనున్నాయి. దీంతో ప్రభుత్వం అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. హనుమకొండ జిల్లాలో వానకాలంలో 59,539 ఎకరాల్లో వరి సాగైంది. 3.18లక్షల టన్నుల వడ్లు దిగుబడి వస్తాయని అంచనాలు ఉన్నాయి. వానకాలం వడ్లతో వచ్చే బియ్యాన్ని ఆహార అవసరాల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. స్థానిక ఆహార అవసరాలకు మినహాయించి 2లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. నిర్దేశించిన లక్ష్యంలో 79వేల టన్నులు సన్న రకాలు, 50వేల టన్నులు స్థానిక అవసరాలకు, మరో 50వేల టన్నులు విత్తనాలకు కేటాయించే ప్రణాళిక ఉన్నది. జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 109, మహిళా సంఘాల ఆధ్వర్యంలో 51 కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వసతుల కల్పనలో ఈసారి ముందుగానే ప్రణాళిక సిద్ధమైంది. వడ్లకు మద్దతు ధరతో రైతులకు భరోసా కల్పించేలా ఇవి ఉన్నాయి. కౌలు రైతులు స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా ముందే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వడ్ల కొనుగోలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సీజన్‌కు అనుగుణంగా అవసరం మేరకు మరిన్ని కొనుగోలు కేంద్రాలను పెంచే ప్రణాళిక ఉన్నది.
అందుబాటులో గన్నీ సంచులు
వడ్ల కొనుగోలు కోసం ప్రస్తుతం జిల్లాలో 16లక్షల బస్తా సంచులు అందుబాటులో ఉన్నాయి. మరో 10లక్షల బస్తా సంచులను కొనుగోలు కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వడ్లను తరలించే లారీ ట్రాన్స్‌ఫోర్టు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. కొనుగోలు కేంద్రాల నుంచి రవాణా సులభంగా ఉండేలా జిల్లాలోని మండలాలను ఐదు సెక్టార్లుగా విభజించారు. మొదటి వారంలోనే వడ్ల కొనుగోలు మొదలైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. కొనుగోలు కేంద్రాల వారీగా రైస్‌మిల్లుల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. మేరకు గన్నీ టార్ఫాలిన్లు, మాయిచ్చర్ మిషన్లను సమకూర్చారు. వడ్ల కొనుగోలు ప్రక్రియలో ఇటీవల వచ్చిన మార్పుల మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వడ్లను కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు తరలించే లారీల ఫొటోలను తీసి ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ వ్యవస్థలో అప్లోడ్ చేయనున్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ మొత్తం విలువైన వడ్లను విక్రయించిన రైతుల విషయంలో ప్రత్యేకంగా తూధువీకరణ ప్రక్రియ ఉండనుంది. జియో ట్యాగింగ్ విధానంతో కొనుగోలు కేంద్రం లోకేషన్ గుర్తింపు, వడ్లను లోడ్ చేసిన లారీలను పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుత సీజన్లో సాధారణ రకం వడ్ల ధర కింటాళ్కు రూ.2,040 ఉన్నది. ఏ గ్రేడ్ రకం వడ్ల ధర క్వింటాళ్‌కు రూ.2,060 ఉన్నది. కొనుగోలు కేంద్రంలో పూర్తయిన రెండు రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.