ఐనవోలు, నవంబర్ 8 : రైతన్న కష్టం తెలిసిన నేత కేసీఆర్ రాక కోసం యావత్ దేశ రైతులు ఎదురుచూస్తున్నారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని నందనం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో 68 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.68లక్షల 7వేల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన తూపతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ రైతును రాజును చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారని పేర్కొన్నారు.
వ్యవసాయానికి 24గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో మొదటి రకం ధాన్యానికి రూ.2,060, రెండో రకానికి రూ.2,040 చొప్పన ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని వివరించారు. రైతులు ప్రస్తుతం మార్కెట్లో ఏ విలువ ఉందో తెలుసుకొని ఆయా పంటలు వేసుకోవాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాన్ని సకాలంలో ప్రారంభించి వడ్లు కొనుగోలు చేస్తున్నందున ఐనవోలు లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు వేల్పుల మల్లయ్య కృతజ్ఞతగా ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, సివిల్ సైప్లె డీఎం మహేందర్, ఏవో కవిత, తహసీల్దార్ రాజేశ్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్రావు, సర్పంచులు యాకర మంజుల, శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీ లక్ష్మి, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జయపాల్, పార్టీ మండల అధ్యక్షుడు పొలెపల్లి శంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, మండల నాయకులు సురేశ్, రాజు, దేవదాసు, నరేశ్, యుగేందర్ పాల్గొన్నారు.