‘ఓరుగల్లు అంటేనే ఉద్యమాల వీరగడ్డ.. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్‌లో గులాబీ జెండా ఎగరాలి.. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులనుద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన ఆయన, ఎన్నికల్లో గెలుపు కోసం నేతలకు దిశానిర్దేశం చేశారు.
2014 ,2019లో వరంగల్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ గెలిచిందని, ఈ సారి కూడా వరంగల్‌లో గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, అప్పటి వరకు విధ్వంసమైన తెలంగాణను పదేండ్లు కష్టపడి వికాసం వైపు మళ్లించారని గుర్తుచేశారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని చెప్పారు. కరెంటు పరిస్థితిని ఎవరు బాగు చేశారని చిన్నపిల్లవాడిని అడిగినా కేసీఆర్ అని చెబుతారన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణను సత్వరం అభివృద్ధి చేయాలన్న తపనతో 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించామని, పరిపాలనపై పూర్తి దృష్టి కేంద్రీకరించి పార్టీకి కొంత తకువ సమయం వెచ్చించామని చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకుంటూ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతామన్నారు. పార్టీ పరంగా లోపాలను సమీక్షించుకుంటామని, పార్లమెంట్ ఎన్నికల నాటికి మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పకనబెట్టి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించి విజయం దిశగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తల్లో ఉత్సాహం యథావిధిగా ఉందని, ఇదే చైతన్యంతో పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేయాలన్నారు. ‘కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు, 420 హామీలు. ఇదే విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని అసెంబ్లీ సాక్షిగా భట్టి అబద్ధమాడారు.
కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని, ఆ పార్టీ 420 హామీలపై ఎండగట్టాలి. నెలరోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ప్రజలకు మంచి చేసే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలు పేదలను నష్టపరిచాయి. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నది. కేసులకు భయపడేది లేదు. బీఆర్ఎస్కు పటిష్టమైన లీగల్ సెల్ ఉంది. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుంది. తప్పుడు కేసులను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకుని పోరాడాలి. ఒక బీఆర్ఎస్ ఎంపీపీపై కేసు పెడితే మిగతా బీఆర్ఎస్ ఎంపీపీలంతా స్పందించాలి. ఎకడికకడ తప్పుడు కేసులపై నాయకులు సమష్టిగా స్పందించాలి. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం స్పందిస్తుంది’ అని కేటీఆర్ అన్నారు. సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, బీఆర్ఎస్ జిల్లా పార్టీల అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, గండ్ర జ్యోతి, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్మన్ ఎం.సుధీర్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
హనుమకొండ, జనవరి 10 : అబద్ధపు హామీలు, వారంటీ లేని గ్యారెంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్పై అసత్య ప్రచారాలతో రోజులు గడుపుతూ ప్రజలను మభ్యపెడుతున్నదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన పార్టీ సమీక్ష సమావేశానికి శ్రేణులు ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లగా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను కాంగ్రెస్ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని, ఒకో మంత్రి ఒక్కో తీరుగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు, పెన్షన్లు సకాలంలో అందక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు. ఏ రోజుకూడా పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి గాని, హామీల గురించిగాని కాంగ్రెస్ మాట్లాడలేదని గుర్తు చేశారు. ఇక్కడ కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు విజయలక్ష్మి, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోదా కిరణ్, సంకు నర్సింగ్, గుంటి రజిత శ్రీనివాస్, నాయకులు పులి రజినీకాంత్, చింతాకుల ప్రభాకర్, నయీముద్దీన్ ఉన్నారు.