వరంగల్, నవంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటున్నది. పరీక్షలు రాసి రిజల్ట్ వచ్చి ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడంలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్/ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు నిరుద్యోగులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో టీజీఎన్పీడీసీఎల్ సరిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్లను ఏర్పాటు చేసింది.
కొత్త వ్యవస్థకు అనుగుణంగా టీజీఎన్పీడీసీఎల్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది. టీజీఎన్పీడీసీఎల్లో 100 జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం 2023 మార్చి 31న నోటిఫికేషన్ జారీ అయ్యింది. జూన్ 4న అప్పటి ప్రభుత్వం హైదరాబాద్లో రాతపరీక్ష నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా రిజల్ట్ విడుదల కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోస్టుల భర్తీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాత పరీక్ష జరిగిన 14 నెలలకు ఫలితాలు విడుదల చేసింది. అర్హుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి రెండు నెలలు అవుతున్నా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. దీంతో ఎంపికైన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.