నర్సంపేట, సెప్టెంబర్ 27 : వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో మిర్చి పంట ను అధికంగా పండిస్తున్నందున ఇక్కడ మి ర్చి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో హార్టీకల్చర్ రీసెర్చ్ స్టేషన్, సీడ్స్ అండ్ స్పైసెస్ పరిశోధన కేంద్రాలను మంజూరు చేసి, సర్వే నం 58లో 54 ఎకరాల భూమిని సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ యూనివర్సిటీకి అందజేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు గడుస్తున్నా మిర్చి పరిశోధనా కేంద్రంపై ఎలాంటి పురోగతి లేదన్నారు. ఏటా నర్సంపేట ప్రాంతంలో మిర్చి, ఉద్యానవన పంటలకు తెగుళ్లు ఆశించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రూ. 80 కోట్లతో మార్కెటింగ్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లక్ష టన్నుల సామర్థ్యం గల గోదాములను అందుబాటులోకి తెచ్చామని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని లేఖలో పెద్ది కోరారు.