ఎల్ఆర్ఎస్ పథకంలో ఫీజుపై 25 శాతం రాయితీకి గడువు ఒక్కరోజే మిగిలింది. తొలుత మార్చి 31తో ముగియగా ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. అప్పటి వరకు రాయితీ వర్తిస్తుందని ప్రకటించింది. అంతా బాగానే ఉన్నా ఫీజులు చెల్లించాలంటే మూడు శాఖలకు చెందిన అధికారులు దరఖాస్తుల పరిశీలన చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల వెరిఫికేషన్ పూర్తయితేనే దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించాల్సి ఉంది. ప్రతి రోజూ వందల మంది ఫీజులు చెల్లించేందుకు వస్తున్నప్పటికీ వివిధ స్థాయిలో వెరిఫికే షన్ పెండింగ్ ఉండడంతో ఫీజు జనరేషన్ కావడం లేదు. దీంతో గడవు ముగిసి రాయితీ కోల్పో తామని దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
– వరంగల్, ఏప్రిల్ 29
ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాని సమయంలో ప్రభుత్వం వెరిఫికేషన్ చేయకున్నా ఫీజులు జనరేట్ చేసి దరఖాస్తుదారులకు పంపించారు. ముందు ఫీజులు చెల్లించండి.. తర్వాత వెరిఫికేషన్ చేస్తామంటూ అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో బల్దియా పరిధిలో సుమారు లక్షకు పైగా దరఖాస్తుల్లో 65 వేలకు పైగా దరఖాస్తులకు ఫీజులు జనరేట్ చేసి పంపించారు. వారిలో మార్చి 31 వరకు 14 వేలకు పైగా అర్జీదారులు రూ. 94 కోట్లకుపైగా ఫీజులు చెల్లించారు. అయితే ప్రభుత్వం దరఖాస్తుదారులకు మరో అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ 30 వరకు రాయితీ గడువును పొడిగించింది.
మార్చి 31 వరకు ఫీజులు జనరేషన్ కాని దరఖాస్తుదారులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వెరిఫికేషన్ తర్వాతనే ఫీజులు జనరేట్ అవుతున్నాయి. మూడు శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో వేల దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయక పెండింగ్‌లో ఉండడంతో వారు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. అధికారులు రెవెన్యూ వార్డులు, గ్రామాల వారీగా వెరిఫికేషన్ అధికారులను నియమించారు. మున్సిపల్ అధికారులు చాలా వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నప్పటికీ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదు. దీంతో వేల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
మూడు శాఖల మధ్య సమన్వయ లోపంతో వేల మంది దరఖాస్తుదారులు 25 శాతం రాయి తీ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. రాయితీకి గడువు ఒక్క రోజు మాత్రమే ఉండడంతో ఫీజులు చెల్లించేందుకు ముందుకు వచ్చినా వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉండి వీలు కావడం లేదు. దీంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల వెరిఫికేషన్‌కు ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ వారు స్పందించడం లేదు. అది తమ పని కాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు అర్జీదారులు ఆరోపిస్తున్నారు. ఫోన్లు చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. మూడు శాఖల అధికారుల నిర్లక్ష్యంతో వేల మంది దరఖాస్తుదారులు ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ అవకాశం వినియోగించుకోలేక పోతున్నామని ఆవేదన చెందుతున్నారు.