భీమదేవరపల్లి, జూలై 01: ముల్కనూరు – కొత్తకొండ రహదారిలో పెట్రోల్ బంకు సమీపంలో మంగళవారం కారును బైకు ఢీకొన్న సంఘటనలో ఆళ్ల శ్రీహరి (28) మృతి చెందగా మంచిల్ల వెంకటేష్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీహరి మంచిల్ల వెంకటేష్ అనే యువకులు వేలేరుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కొత్తకొండలోని పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న కారును అతివేగంగా ఢీ కొట్టారు.
ఈ ప్రమాదంలో ఆళ్ల శ్రీహరి అక్కడికక్కడే మృతిచెందగా మంచిళ్ల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే వెంకటేష్ ను 108లో అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సాయిబాబు పరిశీలించారు. శ్రీహరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూరు ఎస్సై సాయిబాబు వెల్లడించారు.