దుగ్గొండి : వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో(Auto overturns )ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటప చెన్నారావుపేట మండలంలోని కోనాపురం ఏరియా తండా మధ్యలో గురువారం ఉదయం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారావుపేట మండలంలోని జీడిగడ్డ తండాకు చెందిన సుమారు 45 మంది రోజువారి కూలీలు నర్సంపేట మండలం ఇకాలపల్లి వద్ద మిరప తోటలో కూలీ పనికి వెళ్తున్న క్రమంలో 45 మంది కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో ఏరియా తండా సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో కూలీలందరికీ గాయాలయ్యాయి. ఈ దుర్ఘటనలో బానోతు సుక్య (65) మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న చెన్నారావుపేట ఎస్ఐ రాజేష్ రెడ్డి తన సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లి గాయపడిన కూలీలను వెంటనే 108 వాహనంలో నర్సంపేటలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వాహనంలో పరిమితికి మించి కూలీలను తీసుకెళ్లడమే ప్రమాదానికి కారణం అని స్థానికులు చెబుతున్నారు.