హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 26: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన సభలను పకడ్బందీగా నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పనిదినాల్లో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతివార్డుల్లో సభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ప్రజాపాలన గ్రామసభ నిర్వహణ సమయం లో ప్రతి దరఖాస్తుదారుడికి 4 నుంచి 5నిమిషాలు కేటాయించాలన్నారు.
దరఖాస్తుదారుడికి రూపాయి ఖర్చు కాకుండా చూడాలని, జిరాక్స్ వారు కూడా ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలైన పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారని, ప్రతి గ్రామానికి ఒకరోజు ముందుగానే అప్లికేషన్లు వస్తాయని చెప్పారు.గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, వాటిని ముందుగానే నింపి గ్రామసభకు వచ్చేలా చూడాలని సూచించారు. అలాగే నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలన్నారు. గ్రామసభల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ అందిస్తామని, నిర్వహణపై మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాలని, మున్సిపాలిటీల్లో పారిశుధ్య సిబ్బందితో ప్రచారం చేయాలని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన గ్రామసభల సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని పరిశీలించి జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఆమె అధికారులకు సూచించారు. గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. ప్రజాపాలన విజయవంతంగా అమలు చేసందుకు ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు వారధులుగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్‌కిషోర్‌ఝా, వివిధ జిల్లాల కలెక్టర్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, శశాంక, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషాషేక్, అదనపు కలెక్టర్లు పర్మర్ పింకేశ్వర్ లలిత్‌కుమార్, శ్రీజ, ఎస్పీలు సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, గౌష్ ఆలం, కిరణ్‌ఖరే పాల్గొన్నారు.