ఆదివాసీ దేవతలైన సమ్మక్క-సారక్క దర్శనానికి రెండో రోజు భక్తులు పోటెత్తారు. మినీ జాతర సందర్భంగా గురువారం 80వేల మందికిపైగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. తల్లుల చెంతకు వచ్చి విడిది చేసినవారితో వనమంతా జనమయమైంది. శివసత్తులు, భక్తుల పూనకాలు.. పుణ్యస్నానాలతో జంపన్నవాగు పులకించిపోయింది. సమ్మక్క-సారక్క, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలు మొక్కులు చెల్లించేవారితో కిటకిటలాడుతున్నాయి.
– తాడ్వాయి, ఫిబ్రవరి 2
తాడ్వాయి, ఫిబ్రవరి 2 : మినీ జాతర సందర్భంగా రెండో రోజు మేడారం జన సంద్రమైది. వివిధ ప్రాంతాల నుంచి 80వేల మందికి పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. మొదట జంపన్నవాగు వద్ద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, పుణ్యస్నానాలు చేసి తల్లుల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల గద్దెల వద్ద సందడి నెలకొంది. జాతర పరిసరాల్లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్ఐ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
బయ్యక్కపేటలో గద్దెపైకి తల్లి
సమ్మక్క పుట్టినిల్లు బయ్యక్కపేటలో చందా వంశీయులు తమ ఆడబిడ్డ సమ్మక్కను గద్దెపైకి చేర్చారు. అమ్మవారికి ఇష్టమైన గురువారం రోజున పూజామందిరాన్ని శుద్ధి చేసి చేశారు. డోలివాయిద్యాలతో పూజారులు, తలపతులు సమీప అటవీ ప్రాంతానికి వెళ్లి కంకవనాన్ని సేకరించి గద్దె వద్దకు తెచ్చి ప్రతిష్ఠించారు. సాయంత్రం దేవునిగుట్టపై సొరంగంలో కొలువై ఉన్న సమ్మక్కను తీసుకొచ్చేందుకు డోలివాయిద్యాలు, పెద్ద ఎత్తున నృత్యాలతో గుట్టకు చేరుకున్నారు. పూజారి సిద్ధబోయిన చెలమయ్య తల్లిని తీసుకుని గుట్ట కిందికి రాగా డోలివాయిద్యాలతో తోడ్కొనివచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. అనంతరం గ్రామస్తులు పూజలు చేశారు.
రహస్య పూజలు ముగింపు
సమ్మక్క, సారలమ్మ పూజారుల రహస్య పూజలు గురువారం ముగిశాయి. బుధవారం మండమెలిగే పండుగ సందర్భంగా రాత్రి గద్దెల వద్ద జాగారం చేశారు. గురువారం తెల్లవారుజామున జంపన్నవాగులో స్నానాలు చేసి అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకుని భక్తుల దర్శనాలను నిలిపివేసి రహస్య పూజలు నిర్వహించారు. గద్దెల వద్ద పసుపు, కుంకుమ తీసుకుని సమ్మక్క పూజా మందిరానికి చేరుకొని అక్కడ నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. నేటి నుంచి జాతర ముగిసే దాకా సాధారణ పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 8న తిరుగువారం పండుగతో జాతర పరిసమాప్తమవుతుంది. అదే రోజు పూజారుల కుటుంబాలు వనభోజనాలకు వెళ్తాయి.