మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలను ప్రోత్సహించి రైతులకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులకు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను చెల్లించడం లేదు. మొక్కల పెంపకం కోసం మొదటి ఐదేండ్లు అందించాల్సిన సబ్సిడీని కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. వరంగల్ జిల్లాలో 1800, హనుమకొండ జిల్లాలో 929మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ నిధులు చెల్లించాల్సి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. మొక్కల సంరక్షణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు చేసి తోటలను కాపాడుకోవాల్సి వస్తున్నది.
-వరంగల్, మార్చి 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్ జిల్లాలో 5,378 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేసిన 1800 మంది రైతులకు రూ.2.40 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. హనుమకొండ జిల్లాలో 3032 ఎకరాల్లో ఈ పంటను సాగు చేసిన 929మందికి రూ.1.19 కోట్ల నిధులు రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఈ నిధుల కోసం రైతులు ఉద్యాన శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే సబ్సిడీ నిధుల వివరాలను ప్రభుత్వానికి పంపించామని, చెల్లింపుల విషయం ట్రెజరీ శాఖలో పెండింగ్‌లో ఉన్నదని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సబ్సిడీ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమఅయ్యేవి. ఇప్పుడు చెల్లింపుల ప్రక్రియను ట్రెజరీ శాఖకు బదిలీ చేయడం వల్ల ఈ నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
వంట నూనెల వినియోగం రోజురోజుకు బాగా పెరుగుతున్నది. ప్రస్తుత అవసరాల కోసం మన దేశంలో పెద్ద ఎత్తున పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. పా మాయిల్ దిగుమతితో మన దేశం నుంచి వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, భవిష్య త్తు అవసరాలకు అనుగుణంగా ఆయిల్‌పాం సాగు చేసి రైతులకు లాభం చేకూర్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకొని సాగు విస్తీర్ణం రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలకు చేరే లా ప్రణాళికలు రూపొందించింది. సాగు చేసే రైతులకు అనేక ప్రోత్సాహకాలను అమలు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ మిషన్(టీఎస్వోపీఎం)ను ఏర్పాటు చేసి వందల కోట్లను కేటాయించింది. మొక్కలు, డ్రిప్ పరికరాలు, మొక్కల నిర్వహణ వంటి అన్ని ప్రక్రియల్లో ప్రభుత్వపరంగా రైతులకు సాయం చేసేలా సబ్సిడీ విధానాన్ని అమలు చేసింది. రైతులకు పెట్టుబడి కోసం పంట మొదటి ఏడాదిలో రూ.12 వేలు, తర్వాతి నాలుగేండ్ల పా టు రూ.4200 చొప్పున చెల్లించింది. కానీ వ్యవసాయరంగంపై నిర్లక్ష్యం చూపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పాం రైతులను ఇబ్బందులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం త రపున రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి ఖర్చుల చెల్లింపులను నిలిపివేసింది. ఈ తోటలను కాపాడుకునేందుకు రైతులు అప్పులు చేయా ల్సి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త గా పంట సాగు చేయడం ఆగిపోతున్నది.