ములుగు, జూన్6 (నమస్తేతెలంగాణ) : దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించింది. వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటను తెరపైకి తెచ్చి రైతులను చైతన్యపరచడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో పంట చేతికొచ్చే సమయానికి మార్కెటింగ్ ఎలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ములుగు మండలం ఇంచర్ల సమీపంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకోవడంతో పరిశ్రమ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. దీంతో ఉమ్మడి జిల్లా రైతులకు ప్రయోజనం కలుగనున్నది.
సంప్రదాయ పంటల నుంచి రైతులను మరల్చి ప్రత్యామ్నాయం వైపు తీసుకెళ్లేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా మొక్కలు, ట్రిప్ పరికరాలను రాయితీపై అందజేసి పంట సాగు నుంచి కొనుగోలు వరకు అన్ని బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీకి అందించింది. దీంతో ములుగు జిల్లాలో 763 మంది రైతు లు ముందుకు వచ్చి 2,648 ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై దృష్టి పెట్టలేదు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఇంచర్ల సమీపంలో జాతీయ రహదారి 163కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూముల్లో 12 ఎకరాల ను ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నది.
గత ప్రభుత్వం రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రూ. 11చొప్పున చెల్లిస్తేనే ఒక్కో మొక్కను అందిస్తున్నది. నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తే నాలుగేండ్ల నుండి 30 ఏండ్ల వరకు నిరంతరం ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లోటన్నుకు రూ. 20 వేల నుంచి 25వేలకు పైగా ధర ఉంది. ఈ లెక్కన ఎకరానికి రూ.2లక్షల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
రెండో సంవత్సరం నుంచి కాత వచ్చే వరకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. మూడేళ్ల వరకు మక్కజొన్న, మిరప, పెసర, మినుములు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. అకాల వర్షాలు, గాలి బీభత్సం వచ్చినా పంటలకు నష్టం ఉండదని, పశువులు, కోతులు కూడా దీన్ని నష్టపర్చలేవని రైతులు పేర్కొంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా ముడి వంట నూనెలపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించ డంతో ఆయిల్ పామ్ రైతులపై నష్ట ప్రభావం పడనున్నది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇండోనేషియా, మలేషియా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి కానున్నది. ఇప్పటికే ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.18 వేలకు పడిపోయింది. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.