వాజేడు, జూన్ 23: మండలంలోని తెలంగాణ నయాగర బొగత జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. పర్యాటకులు, చిన్నారులు ఆడుకునే తాళ్లబ్రిడ్జి తెగిపోయింది. చిల్డ్రన్స్ పార్క్ వద్ద బంగీ జంపు సైతం పనిచేయడంలేదు. పార్కింగ్ నుంచి జలపాతం వరకు రూ. 5 తీసుకొని తరలించే బొగత రైడర్ వాహనం, బ్యాటరీ టాప్ ఆటోలు మరమ్మతులకు గురై ఏళ్లు గడుస్తున్నా మోక్షం లేదు. దీంతో కిలోమీటర్ మేర నడిచిరావాలంటే వృద్ధులు, నడవలేని వారు ఇబ్బందులు పడుతున్నారు. జిప్‌లైన్, సైక్లింగ్‌తోపాటు తాగునీటికీ గతిలేదు. బొగత రెస్టారెంట్ మూతపడి మూడేళ్లు గడుస్తున్నా తెరుచుకోవడంలేదు. జలపాతం వద్ద సౌకర్యాలు లేకపోవడంపై పర్యాటకులు పెదవి విరు స్తున్నారు. ఆదాయం బాగానే వస్తున్నా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఇక్కడ అధికా రులు దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకులను గతంలో స్విమ్మింగ్ ఫూల్ వరకు మాత్రమే అనుమతించేవారు. ప్రస్తుతం లోతులోకి వెళ్లి స్విమ్మింగ్ చేస్తుండడంతో ప్రమా దం పొంచి ఉంది. గతంలో ఇదేవిధంగా లోపలికి వెళ్లి 20 మందికి పైగా మృత్యువాతపడిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నతా ధికారులు సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్యాటకులు జలపాతం లోపలి కి వెళ్లి ఈత కొట్టకుండా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
బొగత జలపాతాన్ని వీక్షించేందుకు ఆదివారం రాష్ర్టంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు తరలివచ్చారు. జలపాతం ముందు భాగంలో ఉన్న నీటిలో దిగి స్నానాలు చేస్తూ ఈతలు కొడుతూ సందడి చేశారు.