ములుగు, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : మేడారం మహా జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టర్ మహారాష్ట్ర నుంచి పేదలను తీసుకొచ్చి ఎనిమిది గంటలకు బదులు 12 గంటలు వెట్టిచాకిరీ చేయిస్తున్నాడు. అంతేకాకుండా రూ.600 మాత్రమే ఇస్తూ అన్యాయం చేస్తున్నాడు. మేడారం విధుల్లో కార్మికులకు అవసరమైన సేఫ్టీ పరికరాలు, నిబంధనల ప్రకారం పని గంటలు, కూలీ రేట్లను అమలు చేయాల్సిన కార్మిక శాఖ అధికారులు ఏమేరకు పనిచేస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతోంది.
జాతరలో పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం కాంట్రాక్టర్కు కోట్ల రూపాయలు ఇస్తున్నా కూలీలకు నామమాత్రంగా డబ్బులు ఇస్తూ పెద్ద మొత్తంలో తన జేబులో నింపుకొంటున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 గంటలు పని చేయించడమే కాకుండా రూ.600 మాత్రమే ఇస్తున్నాడని కార్మికులు వాపోతున్నారు. తమకు ఎక్కువ కూలీ కావాలని అడిగితే కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
మేడారం జాతరలో పారిశుధ్య పనులు చేసేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చాం. కాంట్రాక్టర్ చంద్రమోహన్ ఎనిమిది గంటలకు బదులు 12గంటల పని చేయించి రూ.600 మాత్రమే ఇస్తున్నడు. భక్తులు తిని పారేసిన ప్లేట్లు, గ్లాసులు, చెత్త ఏరిపారేస్తున్నాం. పనికి తగ్గ కూలీ ఇస్తే సంతోషంగా ఉండేది.
బతుకు దెరువు కోసం జాతరలో పనిచేసేందుకు వచ్చినం. ఇక్కడ పని ఎక్కువ పైసలు తక్కువ. అనుకున్నట్లు డబ్బులు రావడం లేదు. కాంట్రాక్టర్ చెప్పిన పని చేయడం తప్ప ఏమీ లేదు. ఆయన ఇచ్చినన్ని పైసలు తీసుకోవాలి. లేకుంటే పని బంద్ చేపిస్తడు. పని లేకుంటే కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది. కష్టం అయినా చేయాల్సి వస్తుంది.