జమ్మికుంట, జనవరి 24 : ‘కమలాపూర్‌లో గ్రామసభలో దాడి జరిగింది నాపై కాదు. అధికారుల మీద జరిగింది. టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. కొన్ని చానళ్లు తప్పుడు సమాచారంతో స్క్రోలింగ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు టమాటాలు, కోడిగుడ్లు ప్రజలకు పంచండి. అధికారుల మీద దాడంటే.. మీ ప్రభుత్వంపై మీరు దాడి చేసుకున్నట్లే. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నామోచేతి నీళ్లు తాగినోళ్లంతా ఆ పార్టీలో చేరిండ్రు. కౌశిక్.. కేసులకు భయపడే వ్యక్తి కాదు.
ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తూనే ఉంటా.. పథకాలు అమలు చేసేవరకూ ఉద్యమిస్తా’నని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చే యాల్సిందేనని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చారని, గ్రామానికి 20 ఇళ్లు మాత్రమే వస్తాయని తెలిపారు. మరి గ్రామసభల్లో వందలాది మందికి ఇళ్లు ఇస్తున్నట్లు దరఖాస్తులు తీసుకోవడం.. ప్రజలను బ్లాక్మెయిల్ చేయడమేనన్నారు. ఒక్క పథకాన్ని కూడా అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదని, కాలయాపనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నిస్తున్నందుకే కేసులు పెడుతున్నారని, గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సర్కారు డ్రామాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు.