మహబూబాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అధికారులు షాక్ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందని, తర్వాత చూద్దామని ఓ సారి, ఆన్లైన్లో తప్పుగా నమోదు చేశారని, ప్రభుత్వం ఇంకా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదని ఇప్పుడు చెబుతున్నారు. సర్కారు ఎప్పుడు ఆప్షన్ ఇస్తుందో.. తమకు ఎప్పుడు సబ్సిడీ వస్తుందోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కోసం అర్హులు బ్యాంకులు, గ్యాస్ కంపెనీల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రెండు మూడు సార్లు బుక్ చేసుకుని గ్యాస్ రీఫిల్ తీసుకున్నా సబ్సిడీ పడకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారెంటీలకు మోక్షం లేదని, అధికారుల చుట్టు తిరిగినా ప్రయోజనం లేకుండా పోతోందని పెదవి విరుస్తున్నారు.
విద్యుత్ సబ్సిడీ ఎందుకొస్తలేదని అధికారులను అడిగితే ఎన్నికల కోడ్ వచ్చిందని, తరువాత చూద్దామని పంపించిండ్రు. ఈనెల 10న ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లిన. దీంతో ఆన్లైన్లో యూఎస్సీ నంబర్ 0974567కు బదులుగా 10974576 అని తప్పుగా వేశారని చెప్పిన్రు. మీరే కదా వేసిందని అడిగితే ఒకసారి ఆన్లైన్ చేశాక సరిచేయడానికి వీలు కాదన్నరు. ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తే సరి చేస్తమన్నరు. అదేవిధంగా నా భర్త ఉప్పలయ్య పేరు మీద హెచ్‌పీ కంపెనీలో గ్యాస్(609434) బుక్ చేసి తీసుకున్నం. నెల రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్లినా సబ్సిడీ రాలేదంటున్నరు.
– రచ్చ ఎల్లమ్మ, కూలీ, కురవి
హెచ్‌పీ గ్యాస్ కంపెనీలో 654191 నంబర్ మీద ఆరు నెలల్లో రెండు సార్లు బుక్ చేసి గ్యాస్ మొద్దు తీసుకు న్న. సబ్సిడీ డబ్బులు పడ్డయా అని బ్యాంకు అధికారులను అడిగితే రాలేదంటున్నరు. ఎందుకు పడత లేవని మహబూబాబాద్‌లోని గ్యాస్ కంపెనీకి వెళ్లిన. రెండు సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రాలేదన్నరు. అధికారుల కాడికి పొమ్మన్నరు.
– మేకల నరేశ్, పర్వతగిరి, మహబూబాబాద్
ఖానాపురం/వాజేడు, జూన్ 13 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా చేపట్టిన గృహజ్యోతి పథకం అమలుకు నోచుకోక అర్హులైన లబ్ధిదారులకు కష్టాలు తప్పడంలేదు. తెల్లరేషన్ కార్డుదారులకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది సర్వే చేసి అర్హులను గుర్తించి ఉచిత బిల్లులు అందజేశారు. అయితే చాలా మంది దరఖాస్తుల్లో తప్పులుండడంతో వాటిని సరిదిద్దేందుకు ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం కోడ్ ఎత్తివేయడంతో అర్హులైన లబ్ధిదారులు తప్పొప్పులను సవరించుకునేందుకు ఎంపీడీవో కార్యాలయాలకు తరలివస్తున్నారు. గురువారం ఆన్లైన్లో సాంకేతిక లోపం ఏర్పడి సర్వర్ మొరాయించడంతో వరంగల్ జిల్లా ఖానాపురం, ములుగు జిల్లా వాజేడు ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చొని పడిగాపులు కాశారు. అధికారుల తప్పిదంతోనే తాము రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు.