హనుమకొండ, అక్టోబర్ 31: మొంథా తుపాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్పీడీ సీఎల్ పరిధిలో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలో నష్టం జరిగిందని తెలిపారు. హనుమకొండ జిల్లాలో రూ.7.562 కోట్లు, వరంగ ల్లో రూ.1.168 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు.
రేయింబవళ్లు కష్టపడి విద్యుత్ పునరుద్ధరణ పనులను గత రెండు రోజులుగా చేపట్టినట్లు తెలిపారు. హనుమకొండ డివిజన్ పరిధిలో నీట మునిగిన గోపాల్పూర్, యాదవ నగర్ సబ్స్టేషన్లను శుక్రవారం సీఎండీ సందర్శించారు. గోపాల్పూర్, యాదవ నగర్ సబ్స్టేషన్ ప్రాంతాల విద్యుత్ వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేశామన్నారు. తరచుగా నీట మునిగే సబ్ స్టేషన్లను మార్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే 100 ఫీట్ల రోడ్డులోని ప్రగతినగర్ కాలనీ, మచిలీ బజార్ సెక్షన్లోని కాపువాడలో విద్యుత్ పునరుద్ధరణ పనులను ఆయన పర్యవేక్షించారు. భారీ వర్షంలో సైతం మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ఆహర్నిశలు కష్టపడి పనిచేసిన సిబ్బందిని సీఎండీ అభినందించారు. విద్యుత్ ఉద్యోగులందరు అప్రమతంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. సీఎండీ వెంట డైరెక్టర్ ఆపరేషన్ టి. మధుసూదన్, హనుమకొండ ఎస్ఈ పి. మధుసూదన్ రావు, డీఈ జి. సాంబరెడ్డి, దర్శన్ కుమార్, ఏడీఈ మల్లికార్జున్, ఏఈలు తదితరులు ఉన్నారు.