తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు కొలువుదీరిన కాన్నుంచి ప్రతి యేడు బతుకమ్మ పండుగకు తీరొక్క రంగు చీరెలు తలా ఒకటి ఇచ్చేది. ఆడబిడ్డకు కానుక లెక్క ఇచ్చిండు అని చూసి మురిసిపోయేటోళ్లం. ఆడుకునేందుకు మంచి సౌలత్ చేసేది. వాడకట్టుకు, చెరువుల కాడ పెద్ద పెద్ద లైట్లు పెట్టేది. చెత్తాచెదారం లేకుంట గ్రామ పంచాయతోళ్లు అంతా సాఫ్ చేసి బ్లీచింగ్ పౌడర్ కొట్టి మంచిగచేసేది. సాయంత్రం కాంగనే అందరం రాత్రి పది గొట్టెదాంక దాంక సంబురంగా ఆడుకునేది.
కానీ గీ కాంగ్రెస్ సర్కారు వచ్చినంక చీరెలియ్యలే, వాటికి బదులు ఇత్తనన్న రూ.500 సుత ఇయ్యలే.. మరి మేం పండుగెట్లు చేసుకునేది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారుకు బతుకమ్మ పండుగంటే పట్టింపు లేదా.. ఆడబిడ్డలన్నా ఇంత చిన్నచూపా? అంటూ పేద, మధ్యతరగతి మహిళలు ప్రశ్నిస్తూనే ఆవేదన, అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. చాలాచోట్ల ఎంగిలిపూల బతుకమ్మకు ముందు, ఆ తర్వాత విద్యుత్‌దీపాలు లేక చీకట్లోనే ఆడుకోవాల్సి పరిస్థితి వచ్చిందని గుర్తుచేస్తున్నారు.
– నర్సింహులపేట, అక్టోబర్ 5
పూల పండుగ బతుకమ్మ మొదలై ఐదు రోజులవుతున్నా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొనడానికి, లైట్లు బిగించడానికి నిధుల్లేని పరిస్థితి దాపురించింది. వేడుకలకు ఏర్పాట్లు చేయడానికి సీఎంకు మనసు రావడం లేదా? ఆడబిడ్డ వేడుకంటే గిట్టదా.. పట్టదా మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి.. అని వారు ప్రశ్నిస్తున్నారు.
బతుకమ్మ పండుగకు బీఆర్ఎస్ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన మహిళలకు కానుకగా చీర ఇచ్చేవారు. చీరకు బదులు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 ఇస్తుందని చెప్పిన సీఎం ఆ ఊసే ఎత్తకపోవడంపై పెదవి విరుస్తున్నారు. బతుకమ్మ చీరలను రద్దు చేసిన్రు.. ఇప్పుడు బతుకమ్మ ఉత్స వాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా.. అని ప్రశ్నిస్తున్నారు.
నర్సింహులపేట మండలవ్యాప్తంగా బతుకమ్మ పండుగకు నిధులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు తమ సొంత ఖర్చులతో గ్రామాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు బ్లీచింగ్ పౌడర్‌కు సైతం ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారున్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు గ్రామపంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేసి బతుకమ్మ ఆడుకునేందుకు స్థలం, లైట్లు, సౌండ్‌బాక్స్‌లు ఏర్పాటు చేసేది. ఇప్పుడు నిధులు లేకపోవడంతో అరకొర వసతులు ఏర్పాటు చేయాల్సి వస్తుందని, విద్యుత్ లైట్లు, సౌండ్స్ కోసం సొంతంగా లేదా దాతలపై ఆధారపడాల్సి వస్తుందని నిట్టూరుస్తున్నారు. వసతులు ఏర్పాటు లేకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారని కార్యదర్శులు చెబుతున్నారు.
మహిళలకు చీరెకు బదులు రూ.500 ఇస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. బతుకమ్మ పండుగ మొదలై ఐదు రోజులవుతున్నా పండుగ గురించి పట్టింపులేదు. లైట్లు సక్రమంగా లేవు, చీకటితో ఇబ్బందులు పడుతున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు చీర ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా లేకపోయే.
– మంచాల అనూష, పడమటిగూడెం