దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శవంతమైన పథకం.. ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదు.. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకత పాటించాలి.. ఎవరైనా రూపాయి లంచం తీసుకున్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు కేసు పెట్టిస్తా’నని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం తొర్రూరు పట్టణంలోని ఎల్వైఆర్ గార్డెన్లో మొదటి దళితబంధు లబ్ధిదారులపై ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలకు అవగాహన కల్పించారు. ఏడాదిన్నరలో దళితులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని, డిసెంబర్ నెలాఖరులోపు రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుందని మంత్రి తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గానికి నూతనంగా 3వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారని, సొంత జాగ ఉండి పేదరికంలో ఉన్న వారికి అవకాశాన్ని కల్పిస్తామని వివరించారు.
తొర్రూరు, జూలై 29: దళితబంధు దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా గుర్తింపు పొందిందని, ఇందులో ఎవరైనా తప్పులకు పాల్పడితే ఒప్పుకునే పరిస్థితే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టం చేశారు. తొర్రూరు మండలంలో మొదటి విడుత దళితబంధు లబ్ధిదారుల ఎంపికపై ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలకు శుక్రవారం ఎల్వైఆర్ గార్డెన్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళితబంధు పథకంలో పైరవీలకు తావులేదని, లబ్ధిదారుల ఎంపికలో సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తలదూర్చొద్దన్నారు. పారదర్శకంగా దళితులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ద్వారానే జాబితాను తీసుకుంటే మంచిదని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎవరైనా ఒక రూపాయి లంచం తీసుకున్నా, వారు ఏ స్థాయి వ్యక్తయినా పార్టీ నుంచి సస్పెండ్ చేయించి పోలీస్ కేసు పెట్టిస్తానని హెచ్చరించారు. ఏడాదిన్నరలో దళితులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని, డిసెంబర్ నెలాఖరులోపు రెండో విడుత లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుందన్నారు.
సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఈ పథకాన్ని వర్తింప చేసుకోవద్దని కోరారు. పాలకుర్తి నియోజకవర్గానికి రూ.150కోట్లు కేటాయించగా, తొర్రూరు మండలంలో 360 యూనిట్లకు రూ.36కోట్లు కేటాయించిట్లు తెలిపారు. అసంపూర్తిగా నిలిచిన పనులకు, అవసరమైన చోట నూతనంగా రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ.20కోట్ల నిధులు కేటాయించారని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గానికి నూతనంగా 3వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించారని, సొంత జాగ ఉండి పేదరికంలో ఉన్న వారికి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి కమిషన్ డైరెక్టర్ వెంకటనారాయణగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, వైస్ ఎంపీపీ శ్యాం సుందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కొమురయ్య పాల్గొన్నారు.
బాల్య వివాహాలను అడ్డుకోవాలి
బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దని, అడ్డుకోవాలని మంత్రి దయాకర్‌రావు సూచించారు. పట్టణంలో ఐసీపీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అనాథ పిల్లలకు అండగా నిలువడం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా బాల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు, ఆపరేషన్ ముస్కాన్ వంటి కార్యక్రమాలు తెలంగాణలో కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో గతేడాది 280 బాల్య వివాహాలను నిలుపుదల చేయడం అభినందనీయమన్నారు. ఇన్చార్జి డీడబ్ల్యూవో నర్మద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొర్రూరు, పెద్దవంగర ఎంపీపీలు అంజయ్య,రాజేశ్వరి,జడ్పీటీసీలు శ్రీనివాస్, జ్యోతిర్మయి, పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ ఎస్ నాగవాణి, పరికిపళ్ల అశోక్, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ వెంకటేశ్, డీసీపీయూ ప్రతినిధులు వీరన్న, నరేశ్, అరుణ, అనిల్, వెంకట్, ఉపేందర్, జూబేద, సరోజ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక
మండలంలోని చీకటాయపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి దయాకర్‌రావు సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్పుగొండ ముత్తయ్య, వెంకటనర్సు, తండా యాకయ్య తదితరులు పార్టీలో చేరగా వారికి మంత్రి ఎర్రబెల్లి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంటల శంకర్, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.