హనుమకొండ చౌరస్తా, జనవరి 9 : కాక వెంకట స్వామి మెమోరియల్ టీ-20 ఫేజ్-2 క్రికెట్ పోటీల్లో మ్యాచ్లో వరుస విజయాలను నిజామాబాద్ నమోదు చేసుకోగా నిన్న ఓడిపోయిన రంగారెడ్డి, ఖమ్మం జట్లు నేడు గెలిచి పర్వాలేదు అనిపించాయి. కాగా ఆహ్వానిత వరంగల్ జట్టు మాత్రం ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఒత్తిడి తట్టుకోలేక 9 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుతో ఓటమి చెందింది. వంగాలపల్లిలో వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన తొలి మ్యాచలో కరీంనగర్ జట్టు వరంగల్ జట్టుపై 9 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది.
జట్టులో తక్షిల్ అద్భుత 6 బౌండరీలు ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగుల సాధించగా, 154 లక్ష్యచేధనలో బరిలోకి దిగిన వరంగల్ జట్టు 19.3 ఓవర్లు మాత్రమే ఎదుర్కొని 144 పరుగులకు అలౌట్ కావడంతో వరంగల్ జట్టు ఓటమి మూటకట్టుకున్నది. కరీంనగర్ బ్యాట్స్మెన్ తక్షిల్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో మ్యాచ్లో నిజామాబాద్ జట్టు మెదక్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు 20 ఓవర్లు ఎదుర్కొని కేవలం 119 పరుగులు మాత్రమే సాధించింది, మెదక్ జట్టులో లోహిత్ 37 పరుగుల తో జట్టును ఆదుకున్నాడు.
నిజామాబాద్ జట్టు బౌలర్లు సాయిప్రతీక్, లలిత్రెడ్డి నవీన్ తల 3 వికెట్లతో మెదక్ జట్టును కట్టడిచేశారు. 120 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నిజామాబాద్ జట్టు కేవలం 16.3 ఓవర్లు ఎదుర్కొని 120 పరుగులు సాధించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సాయి ప్రతీక్కి స్థానిక సర్పంచ్ మేనక, వరంగల్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ బహుకరించారు.
టీవీవీఎస్ సుకాంత్ గ్రౌండ్లో జరిగిన తొలి మ్యాచులో రంగారెడ్డి జట్టు ఖమ్మం జట్టుపై గెలుపొందింది. 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించిన రంగారెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేక పోయిన ఖమ్మం జట్టు 17.5 ఓవర్లు ఎదుర్కొని 145 పరుగులకు ఆలౌటైంది.
రంగారెడ్డి జట్టు నవనీత్ రావు14 బౌండరీల, రెండు సిక్సర్లతో సహాయంతో 91 పరుగులు సాధించి అద్భుతప్రతిభ కనబర్చడంతో మన ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. రెండో మ్యాచ్లో మహబూబ్నగర్, నల్గొండ జట్లు తలపడగా మహబూబ్నగర్ నిర్దేశించిన భారీ 181 పరుగుల లక్ష్యాన్ని నల్గొండ జట్టు 17.5 ఓవర్లు ఎదుర్కొని 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నల్గొండ బ్యాట్స్మెన్ సాయినాథ్ 6 సిక్సర్, 6 ఫోర్స్సహాయంతో కేవలం 30 బాతుల్లోనే 72 పరుగులు చేసి ఒంటి చేతితో నల్గొండ జట్టును గెలిపించాడు. కాగా ఈ పోటీలను స్థానిక సర్పంచ్ భూక్యా మేనక, ఉప సర్పంచ్ రవి చందర్, సుధాకర్ నాయక్, ఖమ్మం జిల్లా క్రికెట్ కార్యదర్శి చేకూరి వెంకటేశ్వర్లు, భార్గవ్ నిజామాబాద్ సురేష్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు అచ్చ వెంకటేశ్వర్లురావు, రఘురామ్, తోట రాము పాల్గొన్నారు.