కాశీబుగ్గ/కేసముద్రం, ఫిబ్రవరి 25 : వరంగల్ ఎనుమాములతో పాటు కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో బుధవారం రైతుల పంట ఉత్పత్తుల టెండర్లు ఆలస్యమయ్యాయి. ఈ-నామ్ విధానానికి వినియోగించే సాఫ్ట్వేర్ స్థానంలో కొత్త 2.0 వర్షన్‌ను మంగళవారం రాత్రి ఇన్స్టాల్ చేశారు. మార్కెట్ సిబ్బందికి, దడువాయిలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, శిక్షణ ఇవ్వకుండానే మార్చడంతో బుధవారం రైతులు, వ్యాపారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం, పంట ఉత్పత్తులకు అందించే లాట్ ఐడీ నంబర్ల జారీలో జాప్యం కావడంతో కాంటాలు నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకు వేచిచూసిన మార్కెట్ల అధికారులు పాత పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టారు. మరో వారం రోజుల పాటు కూడా ఇదే పద్ధతే కొనసాగుతుందని తెలిపారు. కాగా, సంస్కరణల పేరుతో ప్రభుత్వం తెచ్చిన మార్పులు రైతులకు శాపంగా మారాయని పలువురు అభిప్రాయపడ్డారు.