నల్లబెల్లి, జూన్ 14 : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదికి తేగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో శనివారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మూడుచెక్కలపల్లె సబ్‌స్టేషన్‌లో అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూటర్ వర్కర్‌గా నీలం శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా, లైన్‌తండాకు చెందిన కొందరు రైతులు ట్రాన్స్ఫార్మర్ సరిగ్గా పనిచేయడం లేదని, మరమ్మతు చేయించాలని కోరగా, శ్రీనివాస్ సంబంధిత ఏఈ హరిబాబుకు సమాచారం ఇచ్చి ఎల్సీ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతు పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలో సబ్‌స్టేషన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న జేఎల్ఎం రమేశ్ ఎల్సీ తీసుకున్న విషయం కన్ఫార్మ్ చేసుకోకుండానే సబ్‌స్టేషన్‌ను ఆన్ చేశాడు. దీంతో లైన్‌తండా వద్ద ట్రాన్స్పార్మర్ మరమ్మతు పనులు చేస్తున్న అన్మ్యాన్డ్ శ్రీనివాస్ విద్యుదాఘాతానికి గురికాగా, చుట్టు పక్కల రైతులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
మరో ఘటనలో ఇదే నల్లబెల్లి మండలకేంద్రంలోని ఓ రైస్‌మిల్లు యజమాని తన ఇంటి వద్ద తాగునీటి కోసం బోరు వేయించుకునే క్రమంలో, స్థానిక సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయితే, ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండానే విద్యుత్ సరఫరా చేయడంతో వాహనం వద్ద పనిచేస్తున్న నలుగురు సిబ్బంది షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో సాదుకుమార్ అనే వ్యక్తికి 60 శాతం గాయాలు కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇళయరాజా అనే వ్యక్తికి 40 శాతం గాయాలయ్యాయి. అజిత్‌కుమార్‌తో పాటు సెల్వకుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ఫ్రైవేట్ దవాఖానకు తరలించారు.
గాయపడిన వారిది తమిళనాడు రాష్ట్రమని తెలిసింది. కాగా, ఈ ఘటనకు ఏఈ హరిబాబే కారణమంటూ రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ఏఈని ఘెరావ్ చేశారు. రెండు ఘటనలకు కారణమైన ఏఈని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల అవసరాలను ఏఈ హరిబాబు క్యాష్ చేసుకుంటూ 24 గంటల విద్యుత్ సరఫరా చేయకుండా వసూళ్ల దందా చేస్తున్నాడని పలువురు రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన ఏఈ హరిబాబు, జేఎల్ఎం రమేశ్‌ను సస్పెండ్ చేస్తానని విద్యుత్ శాఖ డీఈ పెందోట తిరుపతి తెలిపారు.