వరంగల్‌చౌరస్తా, ఫిబ్రవరి 18 : ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో అధికారుల నిర్లక్ష్యంతో రోగులకు వైద్య సేవలు అందకపోగా, భద్రత సైతం కరువ అవుతున్నది. నిత్యం వేలాది మంది ఓపీ, వందల మంది ఐపీ సేవలు పొందుతున్న దవాఖానలో రోగులకు అందాల్సిన సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అయినా అధికారులు స్పందించడం లేదని రోగులు, అటెండెంట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రోగులతో సిబ్బంది ప్రవర్తన శృతి మించుతున్నదని, రోగులు, నర్సింగ్ ఆఫీసర్లు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇందుకు ఇటీవల జరిగిన ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు. గత వారం ఎఫ్ఎం-3 విభాగంలో చికిత్స పొందుతున్న రోగిని డయాలసిస్ సేవల కోసం అంబులెన్స్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించాల్సి ఉండగా తనకు డబ్బులు ఇవ్వలేదని సదరు రోగిని అంబులెన్స్ నుంచి వార్డుకు తీసుకెళ్లకుండా క్యాజువాలిటీ ముందే వదిలి, దూషిస్తూ వెళ్లింది పేషెంట్ కేర్ విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సిబ్బంది.
డబ్బులు చేతిలో పడందే వార్డుల్లోకి అటెండెంట్లను అనుమతించకుండా అడ్డుకుంటున్న సెక్యూరిటీ గార్డుపై ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అటెండెంట్లతో అమర్యాదగా ప్రవర్తించి కొద్ది రోజులు విధులకు దూరమైన ఓ సెక్యూరిటీ సిబ్బంది నైట్ డ్యూటీకి మద్యం సేవించి వచ్చినట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యమేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక భద్రత విషయానికొస్తే దవాఖాన ఆస్తులను అక్రమంగా కాజేయడంలో సిబ్బందే సహకరిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సోమవారం రాత్రి ఎంజీఎం హాస్పిటల్ నుంచి సుమారు 15 ఫీట్ల ఇనుప పైపును ఆటోలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండగా మొదటి ప్రధాన గేటు దాటగానే విద్యుత్ స్తంభానికి బిగించిఉన్న న్యూట్రల్ వైర్ తెగిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా గతంలో సైతం గుర్తు తెలియని వ్యక్తులు చాలా సార్లు దొంగతనానికి పాల్పడినట్లు సిబ్బంది బాహటంగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులు దొంగతనానికి గురవుతున్నా సెక్యూరిటీ కాంట్రా క్టు సంస్థ తీరులో మార్పు లేదు. గతంలో ఓ వైద్యవిభాగానికి సంబంధించిన సుమారు రూ.2 లక్షల విలువ చేసే టీవీ, ప్రొజెక్టర్, వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ జరుగగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వదిలేశారు.
ఓ వైపు వార్తా కథనాలు, మరో వైపులు శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్‌కేర్ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందినా అధికారులు మాత్రం కాంట్రాక్టు సంస్థ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ సంతకాలు చేసి బిల్లుల చెల్లింపులకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. దవాఖానను సందర్శించిన ప్రతిసారి కలెక్టర్ శానిటేషన్ మెరుగుపడాలని, పేషెంట్లతో సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశిస్తున్నా అందుకు తగిన పర్యవేక్షణ చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఎంజీఎంహెచ్ సూపరింటెండెంట్‌గా హరీశ్ చంద్రారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంట్రాక్టు సంస్థ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి విధి నిర్వహణ తీరుపై కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ సిబ్బంది తీరు లో మార్పు కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సిబ్బంది తీరు మార్పు, ఎంజీఎం హాస్పిటల్ ఆస్తులకు భద్రత కల్పించడానికి కఠిన చర్యలు చేపట్టాలని రోగులు కోరుతున్నారు.