తలమడుగు, ఆగస్టు 7 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి(బీ)కి చెందిన రైతు మోతే అశోక్ (48)ది ప్రభుత్వ హత్యేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానకు వెళ్లి అశోక్ మృతదేహాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని రైతు ఆత్మహత్యలు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో మొదలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏ ఒక రైతు చనిపోయినా ముఖ్యమంత్రి బాధ్యత వహించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.