మోర్తాడ్, ఆగస్టు 7 : పదేండ్లుగా వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులకు ఈ సారి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏడేండ్ల తర్వాత వరదకాలువ బోసిపోవడం, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రమే అని చెప్పడంతో నిరాశ చెందారు. మరోవైపు కన్నెపల్లి వద్ద పంపులు ఆన్ చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పలుమార్లు డిమాండ్ చేసినా, ఎస్సారెస్పీ నుంచి నీటిని వరదకాలువకు వదలాలని కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. వానకాలం ప్రారంభమై రెండునెలలవుతున్నా వర్షా ల జాడ లేకపోవడం తదితర కారణాలతో వరదకాలువ ఆయకట్టు ప్రాంత రైతులు వానకా లం సాగుకు దూరమయ్యారు. కొందరు పంటలు వేసినప్పటికీ ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో వరుణుడు కరుణించడంతో పంటలకు ఊపిరిపోసినట్లయ్యింది. ఎట్టకేలకు వరద కాలువకు రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలను తెప్పించడంతో వరద కాలువ ఆయకట్టు రైతాంగం సాగుకు సమాయత్తమైంది.
ఎస్సారెస్పీకి ఆనుకొని ముప్కాల్ శివారులో నిర్మించిన జీరోపాయింట్ నుంచి వరదకాలువ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కమ్మర్పల్లి మండలం నాగాపూర్ గ్రామ శివారు వరకు 27.85 కిలో మీటర్లు ఉంటుంది. నాగాపూర్ శివారులో 27.85 కి.మీ. వద్ద క్రాస్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు. వరద కాలువను రివర్స్ పంపింగ్‌తో నింపడంతో క్రాస్‌రెగ్యులేటర్ వద్ద అధికారులు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం వరద కాలువలో 300 ఎంసీఎఫ్‌టీ నీటినిల్వ ఉన్నదని, వానకాలం పంటల సాగుకు నీరు సరిపోతుందని, రైతులు సాగుకోసం వరదకాలువ నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని డీఈ గణేశ్ సూచించారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే దుష్ప్రచారం చేయడం, ప్రాజెక్ట్ విషయంలో పట్టనట్టు వ్యవహరించడంతో వరద కాలువకు రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు తెప్పిస్తారా? అనే సందేహం రైతుల్లో నెలకొన్నది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు అందించకపోతే ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే వరద కాలువ పరిధిలోని పలు జిల్లాల రైతులు రివర్స్ పంపింగ్ చేయాలని విన్నవించడం వెరసి ఎట్టకేలకు కాళేశ్వరం జలాలు తెప్పించడంతో బీఆర్ఎస్ నాయకులు, రైతులు సంబురాలు చేసుకున్నారు. కాళేశ్వరంలో భాగమైన రివర్స్ పంపిం గ్ ఏర్పాటుకు కారణమైన కేసీఆర్, ఎమ్మెల్యే ప్రశాంత్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
వర్షాభావ పరిస్థితులు, వరదకాలువకు నీళ్లు రాకపోవడం తదితర కారణాలతో కొందరు రైతులు సాగుకు దూరంగా ఉండాలనుకున్నారు. కానీ రివర్స్ పంపింగ్‌తో వరద కాలువ నిండుకుండలా మారడంతో తిరిగి సాగుకు సిద్ధమయ్యారు. వరినాట్లు వేయడం ప్రారంభించారు. ఈ సారి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వరద కాలువ పరిధిలో దాదాపు 5 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. వరద కాలువలో నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరుగడంతో బోరుబావులపై ఆధారపడి పండించే పంటలకు సైతం ఢోకా లేని పరిస్థితి ఏర్పడింది. చాలామంది రైతులు వరదకాలువపై ఆధారపడి వరి, పసుపు, మక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. వరద కాలువలోకి నీళ్లు రావడంతో రైతులు ధీమాతో ఉన్నారు. వరదకాలువకు కాళేశ్వరం జలాల రాకతో వ్యవసాయం పండుగలా మారింది.
వరదకాలువ తూముల ద్వారా చెరువులు నింపాలి. వరద కాలువకు నీటిని సకాలంలో చేరలేదు. చివరకు రివర్స్‌పంపింగ్ చేసి కాళేశ్వరం జలాలు తెప్పించడం సంతోషకరం. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు తక్కువగా కురిసే పరిస్థితుల నేపథ్యంలో వరదకాలువను నిండుకుండలా ఉంచడంతోపాటు, తూముల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లను నింపాలి. దీంతో గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు పెరిగి సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవు. ఇప్పటికైనా అధికారులు చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలి.
వరద కాలువపై ఆధారపడి పది ఎకరాల్లో నాట్లు వేసినం. ఈ సారి వర్షాభావ పరిస్థితులు, వరదకాలువలో నీళ్లు లేని కారణంగా సాగు చేయొద్దని అనుకున్నం. కానీ రివర్స్‌పంపింగ్ ద్వారా నీళ్లు రావడంతో సాగు చేసేందుకు సిద్ధమయ్యాం. వరదకాలువలో నీళ్లు ఉంటే సాగునీటికి ఢోకా ఉండదని భావించాకే నాట్లు వేసినం. గత ప్రభుత్వ హయాంలో వరద కాలువలో ఎప్పుడూ నీళ్లు ఉండేవి. ఈ సారే నీటి సమస్య ఎదురైంది.
వరద కాలువలో నీళ్లు ఉంటేనే వానకాలంలో వరి సాగు చేసేవాళ్లం. ఈ సారి వరద కాలువలో నీళ్లులేని కారణంగా ఐదెకరాలు సాగుచేయకుండా వదిలేసినం. కానీ వరద కాలువలోకి నీళ్లు రావడంతో ఆలస్యంగా నాట్లు వేయాల్సి వచ్చింది. ఎప్పుడు జూలై మొదటి వారంలో నాట్లు వేసే వాళ్లం. వరద కాలువలోకి ఆలస్యంగా నీళ్లు రావడంతో నాట్లు కూడా ఆలస్యంగా వేయాల్సి వచ్చింది.