తాడ్వాయి, జనవరి31 : మహా జాతరను పురస్కరించుకుని మేడారం పరిసరాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పలుమార్లు మేడారంలో పర్యటించి సమీక్షలు నిర్వహించి జనవరి 31లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించడంతో కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని శాఖల పనులు 50 శాతం మాత్రమే పూర్తికాగా, మరి కొన్ని పునాదుల దశలోనే ఉన్నాయి. దీంతో జాతర సమయానికి భక్తులకు సౌకర్యాలు అందుతాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కల్యాణకట్టల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఐబీ శాఖ చేపట్టిన ఇన్ ఫిల్టరేషన్ బావుల పూడికతీత పనులు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టిన తాడ్వాయి-మేడారం బీటీ రెన్యువల్ పనులు సాగుతున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ శాఖ చేపట్టిన తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శివరాంసాగర్ చెరువు సమీపంలోని మరుగుదొడ్లకు ఇంకా బేషన్లు కూడా బిగించలేదు. కొంగలమడుగు ప్రాంతంలో అయితే కేవలం కందకాలు తీసి వదిలేశారు. వాటి పనులు ఇంకా ప్రారంభించనేలేదు. అధికారుల అలసత్వంతో కోట్లాది రూపాయలతో పనులు చేపడుతున్నా సౌకర్యాలు కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే భక్తులకు ఉపయోగపడేలా కనిపిస్తుంది. పనుల్లో వేగం పెంచకుండా అధికారులు మంత్రుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. ఇప్పటికే ముందస్తుగా వచ్చే భక్తులు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.