నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 15 : నర్సంపేటలోని నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల, జిల్లా వైద్యశాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి రావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కొనసాగిందని, గత ప్రభుత్వంలో నర్సంపేటకు మెడికల్ కళాశాల తీసుకొచ్చినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణానికి తీసుకొచ్చి వైద్యశాలను నిర్మించినట్లు తెలిపారు. ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఈ ఏడాది 50 సీట్ల అనుమతి కూడా ఇచ్చిందన్నారు. నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్‌గా రూపుదిద్దుకోవాలనే నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూరు చేయించామని చెప్పారు. భవిష్యత్‌లో 150 సీట్లకు పెంచుకొనే అవకాశం ఉందన్నారు. పీజీ కళాశాల రావాల్సి ఉందని, మెడికల్ కళాశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయడం వల్ల నర్సింగ్ కళాశాల మంజూరు కావడం హర్షించదగిన విషయమని పేర్కొన్నారు.
నర్సింగ్ కళాశాలకు శాశ్వత బిల్డింగ్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సహాయ సిబ్బంది, రెసిడెన్షియల్ భవనాలు, సీట్ల పెంపు, ల్యాబ్స్, ఇతర వసతుల కోసం గత ప్రభుత్వం జీవో నంబర్ 83 ద్వారా రూ.183 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రూ.183 కోట్ల నిధులు తీసుకొచ్చానని, ఈ పనులు కాకుండా కొత్త పనులకు టెండర్లు పిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 9 నెలల కాలం వృథా అయిపోయిందని, మెడికల్ కళాశాలలో ఇంకా కొన్ని అంతస్తుల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందన్నారు.
నర్సంపేటకు జిల్లా వైద్యశాల రావడంతో అంతకుముందు ఉన్న సివిల్ ఆసుపత్రిని ఎత్తేయకుండా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నెక్కొండకు తరలించాలని కోరారు. దుగ్గొండి పీహెచ్‌సీని 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని, నియోజకవర్గంలో 53 పల్లె దవాఖానాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయడం జరిగిందన్నారు. 29 దవాఖానల్లో సేవలు అందుతున్నాయని, ఇంకా మిగిలినవి పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. పట్టణంలోని 3 బస్తీ దవాఖానల్లో రెండు పూర్తి చేశామని, మిగిలిన దవాఖానలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామంలో సర్వే నంబర్ 58లో 54ఎకరాల సువిశాలమైన స్థలంలో హార్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని, వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను పాకాలకు తీసుకొచ్చామని, రంగాయచెరువు, పాకాల ప్రాజెక్టులను సాధించామన్నారు. వందల కోట్లతో రోడ్లు, హైలెవల్ బ్రిడ్జిలకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారని, ప్రస్తుతం అవి కార్యరూపం దాల్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థ అయిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సీఎం రావడం గౌరవప్రదంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది అన్నారు.