నర్సంపేట, మార్చి 4: నర్సంపేట వ్యవసా య మార్కెట్‌కు మక్కలతో కళకళలాడింది. రైతులు భారీగా తీసుకురావడంతో మార్కెట్లో ఎటుచూసినా పచ్చని పరదా కప్పినట్లు కనిపించింది. అయితే రోజుల తరబడి అలాగే ఉండడంతో యార్డు మొత్తం మక్కలతో నిండిపోయింది. గ్రామాల్లో మక్కలు ఆరబోసేందుకు సరైన కల్లాలు, స్థలాలు లేక రైతులు ఇక్కడికి తరలివస్తున్నారు. ఒక దశలో మార్కెట్లో ఆరబెట్టేందుకు స్థలం సరిపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో కాలుతీసి కాలు వేసే పరిస్థితి లేకుండా మక్కలు ఉన్నాయి.
మక్క లు సరిగ్గా ఎండక రైతులు రోజుల తరబడి మార్కెట్లోనే ఉంటున్నారు. వ్యా పారులు తేమ చూసి మక్కలను విక్రయిస్తుండగా తేమ శాతం తక్కువ ఉన్న మక్కలను మాత్రమే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 14-15 శాతం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉన్న మక్కలను కొనకపోవడంతో రైతులు స్థానికంగా ఉన్న ఈ మార్కెట్ యార్డులో రోజల తరబడి ఆరబోస్తున్నారు.
మార్కెట్‌కు వచ్చిన రైతు వారం, పది రోజులు ఇక్కడే ఉంటూ మక్కలను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2200లు మాత్రమే పలుకగా ప్రైవేట్ వ్యాపారులు రూ.2310 నుంచి రూ.2360వరకు ధరలు పెట్టి మక్కలను కొనుగోలు చేస్తున్నారు. గడిచిన వారం రూ.2400 వరకు పలకడంతో రైతులు ప్రైవేటు ప్రైవేటు వైపే మొగ్గుచూపుతున్నారు. ఇదిలా ఉండగా మార్కెట్లో తాగునీటి, ఇతర సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.