పోచమ్మమైదాన్, ఏప్రిల్ 16 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు లక్షలాదిలాగా తరలివచ్చి బీఆర్ఎస్ బలమెంతో చూపించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. వరంగల్ దేశాయిపేటలో బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు సెల్‌ఫోన్ ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. ‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి’ అన్న చందంగా ప్రజలు కదలిరావాలని కోరారు. బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ దిమ్మతిరిగిపోయేలా చేయాలని చెప్పారు.
ఈ సభను విజయవంతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి కలిసికట్టుగా రావాలన్నారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ దేశాయిపేటలో నుంచి ప్రజలు ఉత్సాహంగా కదలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తూర్పు నుంచి 110 బస్సు లు, 211 టాటా మాక్స్‌లు, 200 కార్లతో పది వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి డివిజన్ల వాడవాడలా వాల్ రైటింగ్, వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తూ, పార్టీ జెండా గద్దెలకు రంగులు వేయిస్తున్నట్లు కేటీఆర్‌కు చెప్పారు. మీ శక్తినంతా కూడదీసి రావాలని, 12వ డివిజన్ నుంచి 500మంది రానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20 లోగా కార్యకర్తలు, నాయకుల వివరాలు, ఫోన్ నెంబర్లు పంపాలని కోరారు.