వర్ధన్నపేట, నవంబర్ 2: కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నల్లబెల్లికి ఆయన గురువారం సాయంత్రం ముఖ్య నాయకులను కలిసేందుకు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జక్కి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలువురు బాధ్యులు నాగరాజు కారుకు సైకిల్ అడ్డుపెట్టి గ్రామానికి రావద్దని నిరసన తెలిపారు. మండల అధ్యక్షుడైన తనకు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి ఎలా వస్తావని నిలదీసినట్లు గ్రామస్తులు తెలిపారు. కాంగ్రెస్ నుంచి నమిండ్ల శ్రీనివాస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఆశించాడు. కానీ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో మాజీ ఐపీఎస్ నాగరాజుకు టికెట్ ఇచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు.
దీంతో నాగరాజుకు నమిండ్ల వర్గీయులు సహకరించడంలేదు. గురువారం సాయంత్రం నల్లబెల్లికి రాగా పార్టీ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. వెనుక వాహనంలో ఉన్న నాగరాజు తన కారును వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ముందు నాగరాజు వర్గీయులు ఉన్న కారును పాక్షికంగా ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ప్రవీణ్‌కుమార్ చేరుకొని శ్రీకాంత్, అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా కాంగ్రెస్ నాయకుడు వెంకటేశ్వర్లు తమపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.