హనుమకొండ చౌరస్తా, మార్చి 9 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నగరంలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. బైకులు, కార్లు కొనాలనుకునే వారి అభిరుచికి అనుగుణంగా ప్రముఖ కంపెనీల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి రెండు రోజుల పాటు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి నగర ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ ఆటోషో తమ వద్దకే రావడంతో అన్ని వర్గాల వారు, ముఖ్యంగా యువత ఉత్సాహంగా తరలివచ్చింది.
పదుల సంఖ్యలో ఉన్న స్టాళ్లలో ప్రదర్శించిన రకరకాల బైక్‌లు, కార్లను వీక్షించి కంపెనీ ప్రతినిధుల ద్వారా వివరాలు తెలుసుకొని నచ్చిన వాహనాలను కొనుగోలు చేసి సంబురంగా ఇంటికి తీసుకెళ్లారు. అన్ని షోరూంలు తిరిగే అవసరం లేకుండా ఒకే వేదికపై అన్ని రకాల వాహనాలను తీసుకురావడం తమకు సౌలభ్యంగా ఉన్నదని ఆటోషో ఏర్పాటుచేసిన నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని వారు కోరారు.
ఆదివారం ముగింపు కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఆటోషోకు వచ్చిన వారిని ప్రోత్సహించేందుకు బంపర్ డ్రా ద్వారా మధుసూదనచారి పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. ఆ తర్వాత స్టాళ్లు ఏర్పాటు చేసిన కంపెనీ ప్రతినిధులకు ఆయన జ్ఞాపికలు బహూకరించారు.
కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, యాడ్స్ మేనేజర్ అప్పని సూరయ్య, సర్క్యూలేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్‌రెడ్డి, ఆదర్శ ఆటోమోటివ్స్ జనరల్ మేనేజర్ కేఎస్ కల్యాణ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు, వరంగల్ కార్యదర్శి పీఎస్ ఫణికుమార్, హనుమకొండ కార్యదర్శి డాక్టర్ సీహెచ్.ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులు రఘుపతిరెడ్డి, సురేశ్‌కుమార్, కృష్ణార్జునరావు, మధుసూదన్‌రెడ్డి, కార్తిక్ పాల్గొన్నారు.
ఆ రోజుల్లో సైకిల్ మోటర్ వెంట పరుగెత్తేవాళ్లం..
ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
1967-68 హైస్కూల్లో చదివే రోజుల్లో ఊళ్లోకి సైకిల్ మోటార్ వస్తే ఆ వాహనం వెంటే ఆడుకునేవాళ్లం. ఇప్పుడు సైకిల్ మోటార్ నుంచి కారు, 1971-72 ప్రాంతంలో హనుమకొండ చౌరస్తాలో బుల్లెట్ బండి సౌండ్ నుంచి ప్రస్తుతం లగ్జరీగా కార్లు వచ్చాయి. 1980లో వాహనాలకు నెంబర్ ఏపీవో అని ఉండేది.. తర్వాత మారుస్తూ వచ్చారు. 40లక్షల మంది ఉంటే 10లక్షల వాహనాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైంది. చదువుకునే రోజుల్లోనే సైకిల్‌మోటార్, ఇల్లు కట్టుకోవాలని, విమానం ఎక్కాలని అందరికీ కోరిక ఉండేది.. ఇప్పుడు 3 విమానాలు ఎక్కి దిగొచ్చు.
ప్రపంచంలో స్పీడ్ పెరిగింది. ఫలాలు తినడంలోనే తరాలు గడిచిపోతున్నాయి. మన తాతలు సైకిల్ మోటార్ చూసేవాళ్లం. ఇప్పుడు వాహనాల నుంచి రాకెట్ వరకు అన్నీ మనం చూస్తున్నామంటే అంత స్పీడ్ యుగంలో ఉన్నాం. ఇప్పుడు కారు కామన్ అయిపోయింది. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో అన్ని వాహనాలు ఒకే చోట ఉండేలా నిర్వహించిన ఆటోషో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల మనకు నచ్చిన, మన్నికైన వాహనాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుంది.
ఒకప్పుడు అంబాసిడర్ కారు ఉండేది, ఇప్పుడు అనేక కొత్త బ్రాండ్ల కార్లు వస్తున్నాయి. మంచి ప్రమాణికగల కార్లను తయారు చేస్తున్నారు. ఆ పోటీ తట్టుకుని గొప్ప వాహనాలు తీసుకువస్తున్నాయి. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ‘నమస్తే తెలంగాణ’ది గుణాత్మక పాత్ర పోషించింది. సర్వతోముఖాభివృద్ధి కోసం పత్రిక కృషి చేస్తున్నది. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం.
తెలంగాణ గుండె చప్పుడు ‘నమస్తే’
ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పాటైన నమస్తే తెలంగాణ పత్రిక తెలంగాణ గుండె చప్పుడు. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆటోషో నిర్వహించడం ప్రజలకు మంచి అవకాశం. ఒకే గొడుకు కిందకు అన్ని వాహనాలను తీసుకొచ్చి వారికి అవసరాలకు అనుగుణంగా ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉంది. వాహనాల కోసం షోరూంలు తిరగాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఇక్కడికి వచ్చి అన్ని స్టాళ్లు సందర్శించి తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి వేదికలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నమస్తేతెలంగాణ-తెలంగాణటుడేకు అభినందనలు.
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
స్టాళ్లలో ప్రదర్శించిన వాహనాలు
ప్రస్తుతం మార్కెట్లో హవా కొనసాగుతున్న కార్లు, బైక్‌లతో పాటు ఈవీలూ ఆటోషోలో కొలువుదీరాయి. అన్ని రకాల వాహనాల ప్రదర్శన, అమ్మకానికి ఏర్పాటు చేశారు. రెండు రోజుల ఆటోషోలో ఆదర్శ ఆటోమోటివ్స్(మారుతి సుజుకి), ఆదర్శ ఆటోవరల్డ్(నెక్సా), మహవీర్ స్కోడా, మాలిక్ కియా, రామ్గ్రూప్ ఎంజీ 100, సిట్రోన్, హోండా, నియోన్ హుందాయ్, విన్ మోటార్స్, ఆదర్శ టీవీఎస్, ఆరూష్ ఆటోమోటివ్స్(ఏథర్), హ్యాపీ ఆటోమోటివ్స్(యమహా), చేతక్, రాయల్ ఎన్ఫీల్డ్(ఎస్వీ మోటార్స్), విన్ మోటార్స్(టీవీఎస్), ఐఆర్ ఈవీ బైక్స్, ప్రణవ్ మోటార్స్, డీసీసీ బ్యాంకు ప్రదర్శనతో పాటు బ్యాంకు లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచడంతో వాహనాలు కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపారు.
Warangal3
మంచి అవకాశం
వరంగల్‌లో ఇలాంటి ఆటోషో ఏర్పాటు చేయ డం వినియోగదారులకు మంచి అవకాశం. నమస్తేతెలంగాణ-తెలంగాణటుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ఆటోషోలో చాలా కంపెనీలు పాల్గొన్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు చక్కని వేదిక. ఇలాంటి వేదికలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకవైపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నమస్తే తెలంగాణ మరోవైపు ఆటోఎక్స్‌పో వంటివి నిర్వహించడం అభినందనీయం. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
– మర్రి యాదవరెడ్డి, కుడా మాజీ చైర్మన్
ఇలాంటి వేదికలు మరిన్ని రావాలి
ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇలాంటి వేదికలు వినియోగదారులకు చాలా అవసరం. అన్ని కంపెనీల వాహనాలు ఒకేచోట ఉండడం చాలా బాగుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా సొంత కారు కల నెరవేర్చుకునే వీలుంటుంది. మనకు అనువైన బడ్జెట్లో వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. నమస్తేతెలంగాణ-తెలంగాణ టుడే ఆటోషో ద్వారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి వినియోగదారులకు మరింత చేరువ కావాలి.
– వేణుగోపాల్, ఎంవీఐ
ఏటా ఆటోషో నిర్వహించాలి
నమస్తేతెలంగాణ-తెలంగాణటుడే ఆధ్వర్యంలో ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయం. వాహనం అందరికీ నిత్యావసరమైంది. ఇంటికి 2, 3 ఉంటున్నాయి. కొత్తవి కొనేందుకు షోరూంలు తిరిగే పని లేకుండా నేరుగా ఇక్కడికి వచ్చి నచ్చిన వాహనం కొనుగోలు చేయొచ్చు. బ్యాంకర్లు కూడా అందుబాటులో ఉన్నారు. నగరవాసులకు ఇదొక మంచి అవకాశం. కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు తెలియజేస్తున్నందుకు నమస్తేతెలంగాణ-తెలంగాణటుడే కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి.
– అన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు