జయశంకర్ భూపాలపల్లి. అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు నాలా అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని చెరువు శిఖం భూమికి ఓ రెవెన్యూ అధికారి నాలా అనుమతి ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ, సర్కారు భూముల్లో వెంచర్లు చేయడానికి నాలా అనుమతుల కోసం జోరుగా పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే చెరువు శిఖం భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ఫ్లాట్లు చేసి విక్రయించిన రియల్ వ్యాపారులు అదే దారిలో మరో అడుగు ముందుకు వేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో 57 ఎకరాల్లో 13 ఇల్లీగల్ వెంచర్లు చేసి ప్లాట్ల విక్రయాలు జరుపుతున్నారు. అయితే అధికారుల నుంచి చర్యలు లేకపోవడంతో రియల్టర్లు తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ భూములు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లుగా మారుతున్నాయి.
చెరువు శిఖానికి నాలా అనుమతి
భూపాలపల్లి మండలం కొంపెల్లి శివారు 209 సర్వే నంబర్లోని గోరంట్ల కుంట చెరువు శిఖానికి రెవెన్యూ అధికారులు నాలా అనుమతి ఇచ్చినట్లు నీటి పారుదలశాఖ అధికారులు గుర్తించారు. చెరువు శిఖం మొత్తం 22.32 ఎకరాలు ఉండగా ఇందులో నాలుగు ఎకరాలు కబ్జాకు గురైనట్లు తెలిపారు. ఇదే సర్వే నంబర్లో వేంకటేశ్వర దేవాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని సుమారు 5 ఎకరాల్లో నిర్మించారు. కాగా, మరో 3.32 ఎకరాల్లోని శిఖం భూమి ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లింది. 209 సర్వే నంబర్లో చెరువు శిఖం భూమి ఉండగా పక్కనే 213, 208 సర్వే నంబర్లలో పట్టా భూములు ఉన్నాయి.
ఇది అక్రమార్కులకు కలిసొచ్చింది. 208, 213 సర్వే నంబర్ల పేరుతో చెరువు శిఖం భూమికి రెవెన్యూ అధికారుల నుంచి నాలా అనుమతి పొంది ఏకంగా రిజిష్ర్టేషన్ చేయించారు. గత కొన్నేళ్లుగా ఈ ఆక్రమణ తతంగం జరుగుతున్నప్పటికీ, ఇటీవలి కాలంలోనే రియల్ వ్యా పారులు ఓ రెవెన్యూ అధికారి కనుసన్నల్లో నాలా అనుమతి పొంది రిజిష్ర్టేషన్ చేయించుకున్నట్లు తెలిసింది. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని సర్కారు భూములు బయటపడే అవకాశం ఉందని స్థానికులు చెప్పుకుంటున్నారు. గోరంట్లకుంట సమీపంలో సుమారు 10 గుంటల చెరువు శిఖం భూమిని ఓ పోలీస్ అధికారి కొనుగోలు చేసినట్లు సమాచారం.
57 ఎకరాల్లో.. 13 అక్రమ వెంచర్లు
జిల్లా కేంద్రంలో 57 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా 13 వెంచర్లు చేశారు. గుడ్ మార్నింగ్ స్కూల్ సమీపంలో 143 సర్వే నంబర్లో రెండు ఎకరాల్లో ఒక వెంచర్, కేటీకే 8 ఇైంక్లెన్ రోడ్డులో 172,173 సర్వే నంబర్లలో రెండు ఎకరాల్లో ఒకటి, కుందూరుపల్లి గ్రామ రోడ్డు వెంట 174, 175 సర్వే నంబర్లలో నాలుగు ఎకరాల్లో మూడు, 181 సర్వే నెంబర్లో ఐదు ఎకరాల్లో ఒకటి, ఏఎస్ఆర్ గార్డెన్ వెనుక వైపు 309, 310, 319, 320 సర్వే నెంబర్లలో 25 ఎకరాల్లో మూడు, సన్‌వ్యాలీ పాఠశాల దగ్గర 146 సర్వే నెంబర్లో 14 ఎకరాల్లో మూడు, భాస్కర్‌గడ్డలో 361 సర్వే నంబర్లో ఐదు ఎకరాల్లో ఒక వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్రమార్కుల దృష్టి పట్టణంలోని 170 సర్వే నంబర్లపై పడింది. ఈ సర్వే నంబర్లోని అసైన్డ్ భూమికి పట్టాలు ఇవ్వడంపై రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు.
విచారణ జరుపుతాం..
ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములకు నాలా అనుమతి ఇవ్వడం కుదురదు. అలా అనుమతి ఇవ్వడం నేరం. విచారణ జరుపుతాం. ఎక్కడైనా అలా జరిగితే చర్యలు తీసుకుంటాం. అలాగే చెరువు శిఖం భూమికి నాలా అనుమతి ఇవ్వడంపై విచారణ చేపడుతాం. గోరంట్లకుంట శిఖంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోం.
– మంగీలాల్. ఆర్డీవో, భూపాలపల్లి