బచ్చన్నపేట జూలై 29 : బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మంగళవారం భక్తులు ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబ సమేతంగా పుట్టల దగ్గరకి వెళ్లి పసుపు, కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొట్టి నాగదేవత పూజలు చేశారు. అదేవిధంగా పుట్టలో పాలు పోసి నాగమ్మ తల్లి ఇంటిల్లి పాది ని చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. పాడిపంటలు సమృద్ధిగా పండేలా ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేలా, దీవించు తల్లి అంటూ నాగమ్మను వేడుకున్నారు.
బచ్చన్నపేటలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయంల పూజారి గణపురం ఆనంద్ ఆధ్వర్యంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగదేవత విగ్రహాన్ని పూలతో పూజారి అలంకరించారు. భక్తులు విగ్రహానికి పూలమాలవేసి, పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఆర్యవైశ్యులు, గ్రామ సమీపంలో ఉన్న నాగమ్మ పుట్ట వద్దకు వెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రాజయ్య, గణపురం కవిత, పోచంపల్లి రజిత, భాను, నరసింగరావు, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.